నాగబాబు టూర్ తో జనసైనికుల్లో హుషారు..

Deekshitha Reddy
ఇటీవల నాగబాబు కొంతకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు కానీ, ఆయన రంగంలోకి దిగితే జనసైనికుల్లో ఎలాంటి హుషారు ఉంటుందో ఉత్తరాంధ్ర పర్యటనతో తెలిసిపోతోంది. ఉత్తరాంధ్ర పర్యటనకోసం నాగబాబు విశాఖ ఎయిర్ పోర్ట్ కి వచ్చినప్పటినుంచి ఘన స్వాగతాలు మొదలయ్యాయి. నాగబాబుకి ఈ స్థాయిలో కార్యకర్తలు స్వాగతం పలుకుతారని, ఆయన పర్యటన ఇంత సందడిగా సాగుతుందని ఎవరూ ఊహించలేదు.
నాగబాబు ఉత్తరాంధ్రకు ఫిక్స్ అవుతారా..?
ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటనలో జనసైనికులు, పార్టీ నేతలు కూడా హుషారుగా కనపడుతున్నారు. పార్టీలోని లోటుపాట్లను వారు నేరుగా నాగబాబుకు చెప్పుకుంటున్నారు. దీంతో నాగబాబు కూడా పార్టీ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను జనసేనాని పవన్ కల్యాణ్ కు చేరవేస్తానంటున్నారు.
రెండోరోజు విజయనగరం జిల్లాలో నాగబాబు పర్యటించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఆయన పర్యటన కొనసాగుతోంది. జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జనసేన ఫ్యామిలీని చూడటానికి తాను వచ్చానని, వారి అభిప్రాయాలు తెలుసుకుని, అవగాహన పెంచుకోడానికే తన పర్యటన కొనసాగుతుందని చెప్పారు నాగబాబు.
పార్టీపై పట్టు పెంచుకోవాలంటే..
ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని పార్టీ గురించి తెలుసుకోవాలంటే కుదరదని అన్నారు నాగబాబు. నేరుగా వచ్చి పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరు యాక్టివ్ గా ఉన్నారనే విషయాలు తెలుసుకోవడానికే తాను ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నానని అన్నారు నాగబాబు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొనే అవకాశం తనకు కలిగిందని అన్నారు నాగబాబు. జనసేన కార్యకర్తల్లో మంచి జోష్ ఉందని చెప్పారాయన. నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని, వాటి గురించి కూడా కార్యకర్తలు తనకు వివరించారని అన్నారు. ఏపీలో ఖనిజ సంపద కూడా విస్తారంగా ఉందని, దాన్ని చాలామంది దోచుకుంటున్నారని, అలాంటి వారికి కొంతమంది పెద్దల ఆశీర్వాదం ఉందని విమర్శించారు నాగబాబు. ఉత్తరాంధ్రలో ఇప్పటికీ వలసలు కొనసాగడం విచారకరం అని చెప్పారు నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: