గ్యాస్ సిలిండర్ల రేట్లపై కేంద్రం మెలిక.. బాదుడే బాదుడు...

Deekshitha Reddy
గృహ అవసరాలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్ వేరు, వాణిజ్య అవసరాలకు అమ్మే కమర్షియల్ సిలిండర్ వేరు. ఈ రెండిటికీ రేట్ల విషయంలో చాలా తేడా ఉంది. డొమెస్టిక్ సిలిండర్లను అసలు రేటుకి కొన్నా కూడా ఇప్పటి వరకూ కాస్తో కూస్తో రాయితీ వస్తుండేది. ఇటీవల ఆ రాయితీ కూడా పడుతుందో లేదో తెలియని పరిస్థితి. అయితే దాన్ని అధికారికంగా ఎగరగొట్టేందుకు కేంద్రం స్థిర నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్లపై ఇస్తున్న రాయితీని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
పేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌ ధరపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ ప్రజలు కూడా రాయితీ లేకుండా మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద నమోదైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ పథకం వర్తిస్తుంది. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారు ఇకపై సబ్సిడీకి అర్హులు. వారికి మాత్రమే గ్యాస్ కంపెనీలు సబ్సిడీని వెనక్కి ఇస్తాయి.
కోవిడ్ సీజన్ మొదలైనప్పటినుంచి గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇవ్వడం లేదు. కేవలం 40రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఇకపై ఆ 40 రూపాయలు కూడా వెనక్కి రావు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం ప్రకటించింది. దీని ప్రకారం ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రం సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడల్లా 200 రూపాయలు సబ్సిడీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అయితే దీనికి కూడా పరిమితి ఉంది. ఏడాదికి కేవలం 12 సిలిండర్లు మాత్రమే ఇలా సబ్సిడీపై బుక్ చేసుకునే అవకాశముంది. పరిమితి దాటితే మళ్లీ మార్కెట్ రేటుకి సిలిండర్లు కొనాల్సిందే. పరిమితి దాటకుండా ఉంటే మాత్రం 12 సిలిండర్లకు ఒక్కో సిలిండర్ కి రూ.200 రూపాయలు సబ్సిడీ సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

lpg

సంబంధిత వార్తలు: