పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తున్న బీజేపీ..?

Deekshitha Reddy
ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. కలసి కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. పొత్తులోనే ఉన్నామని, 2024 ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని చెబుతుంటాయి రెండు పార్టీలు. అయితే ఇప్పుడు ఈ పొత్తు వ్యవహారంలో ఓ చిక్కొచ్చి పడింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతానికి బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా బిజివేముల రవీంద్ర నాథ్ రెడ్డి ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేస్తారని అంటున్నారు.
ప్రస్తుతం బిజివేముల కాషాయ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఆయన్ను త్వరలో బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించబోతోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తరపున ప్రచారాస్త్రం ఎవరనేది తేలాల్సి ఉంది. వైసీపీ తరపున విక్రమ్ రెడ్డి ఇప్పటికే జనాల్లోకి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు పరిచయం అయ్యారు. ఇప్పుడు బీజేపీ కొత్తగా తమ అభ్యర్థిని పరిచయం చేయాలి, ప్రచారం చేయాలి. ప్రచార కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ ని ఆహ్వానించాలనుకుంటోంది ఏపీ బీజేపీ.
గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. అయితే ప్రచారంలో ఉండగా ఆయన అనారోగ్యంపాలవడంతో.. హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత బద్వేల్ ఉప ఎన్నికల్లో పూర్తిగా బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టినా పవన్ కల్యాణ్ ప్రచారానికి రాలేదు. దివంగత నేత కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చారు కాబట్టి.. తమ ఆనవాయితీ ప్రకారం అక్కడ పోటీ చేయబోము, ప్రచారం కూడా చేయము అన్నారు, అన్నట్టుగానే బద్వేల్ ఉప ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. ఇప్పుడు ఆత్మకూరులో వైసీపీ తరపున కూడా దివంగత నేత కుటుంబ సభ్యులకే అధికార పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ కూడా జనసేన పోటీలో ఉండకూడదు. అయితే బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తోంది. ఆయన్ను ప్రచారానికి తీసుకు రావాలనుకుంటోంది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ప్రకటించారు బీజేపీ నేతలు. ఇక ప్రచారానికి పవన్ ని తీసుకొచ్చి హడావిడి మొదలు పెట్టాలనుకుంటున్నారు. మరి జనసేనాని వారి ఆహ్వానాన్ని మన్నిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: