ఏపీలో ఆర్నెళ్లకోసారి జిల్లాల పేర్లు మారుస్తారా..?

Deekshitha Reddy
ఇప్పటికే ఏపీలో కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం గందరగోలానికి దారి తీసింది. మార్చిన పేరు ఉంచాలని కొందరు, కొత్త పేరు వద్దు, పాత పేరు ముద్దు అంటూ మరికొందరు ఆందోళనలకు సిద్ధమయ్యారు. కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బస్సులు తగలబెట్టడం, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను తగలబెట్టడం వంటి ఘటనలు సంచలనంగా మారాయి. ఈ దశలో ఆందోళనలు, అల్లర్లు కారణం మీరంటే మీరంటూ వైసీపీ.. జనసేన-టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇప్పుడు మరో ట్విస్ట్..
జిల్లాల పేరు మార్పు వ్యవహారంలో ఇప్పుడు మరో ట్విస్ట్ ఎదురైంది. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జిల్లాల పేర్లు మార్చడం అనేది నిరంతర ప్రక్రియ అని, ఆరు నెలల తర్వాత మరో జిల్లా పేరు కూడా మారే అవకాశముందని అన్నారాయన.
బొత్స వ్యాఖ్యలతో మరోసారి కలకలం రేగింది. జిల్లాల పేరు మార్పు వ్యవహారం ఇప్పటికే తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇప్పుడు మరోసారి జిల్లాల పేరు మార్పు అంటే అందరూ ఆందోళనలో పడ్డారు. అయితే బొత్స వ్యాఖ్యలకు పెడర్ధాలు తీస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు అధికార పార్టీ నేతలు. జిల్లాల పేరు మార్పు నిరంతర ప్రక్రియ అంటే.. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తామని అర్థం అని చెబుతున్నారు. ప్రజామోద నిర్ణయాలనే తమ ప్రభుత్వం గౌరవిస్తుందని అంటున్నారు నేతలు.
ఇప్పటికే జిల్లాల పేరు మార్పు వ్యవహారంతో చాలా చోట్ల ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మిగతా సర్టిఫికెట్ల వ్యవహారంలో కూడా కొత్త జిల్లాల పేర్లు గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఈ దశలో మళ్లీ జిల్లాల పేర్లు మార్చే అవకాశం ఉందంటే మాత్రం అది కచ్చితంగా మరింత ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఇప్పుడు మంత్రి బొత్స వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: