శ్రీలంకలా ఏపీ ఎప్పటికీ కాదు.. ఇదిగో సాక్ష్యం..

Deekshitha Reddy
ఏపీని శ్రీలంకతో పోలుస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీకి, శ్రీలంకకు అసలు పోలికేంటని నిలదీస్తున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇలాంటి విమర్శలు పూర్తిగా అసంబద్ధమైనవని అన్నారాయన. కేవలం చంద్రబాబు రాజకీయ అక్కసుతో ఇలా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అసలు సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉన్నాయా అని నిలదీశారు. తన హయాంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టని బాబు, ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నారని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేశామని, అది చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీలంక, శ్రీలంక అంటూ చంద్రబాబు గావుకేకలు పెడుతున్నారని మండిపడ్డారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసలు శ్రీలంక పరిణామాలకు, ఏపీ పరిణామాలకు పోలిక లేదని చెప్పారాయన. శ్రీలంకలా అయ్యే పరిస్థితి ఏపీకి ఎప్పటికీ రాదని చెప్పారు.
కొవిడ్ కాలంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడిందని అన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. కొవిడ్ కష్టకాలంలో సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆదుకున్నామని, అయితే లౌక్ డౌన్లో అన్ని రాష్ట్రాల ఆదాయం పడిపోయిందని, కేవలం ఏపీని మాత్రమే టార్గెట్ చేయడం సరికాదన్నారు బుగ్గన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి టీడీపీ హయాంలో దారుణంగా ఉండేదని, దాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని చెప్పారు బుగ్గన. రైతులు, మహిళలు, బలహీనవర్గాలకు మేలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు. విచ్చలవిడిగా ప్రభుత్వం అప్పులు చేస్తోందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. టీడీపీ హయాంలోనే అప్పులు ఎక్కువగా చేశారని, తమ హయాంలో వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టిన టీడీపీ నాయకుల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని ఆయన విమర్శించారు. ఏపీని, శ్రీలంకతో పోలుస్తూ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: