రాజ్యసభ సీటుకోసం జగన్ కి రూ.200కోట్లు ఇచ్చేవారున్నారా..?

Deekshitha Reddy
ఏపీలో రాజ్యసభ సీట్లకేటాయింపు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ కేటాయించిన నాలుగు సీట్లలో రెండు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు దక్కడం విశేషం. అందులో ఒకరు బీదా మస్తాన్ రావు కాగా, మరొకరు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య. అయితే వ్యాపారవేత్త బీదా మస్తాన్ రావుకి సీటు ఇవ్వడం వెనక డబ్బు సంచులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బీదా మస్తాన్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. రాజ్యసభ సీటుకి 200 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేవారుంటారని, అంత మాత్రాన ఆ డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తారా అని ప్రశ్నించారు.
అసలు 200కోట్లు ఇస్తారా..?
రాజ్యసభ సీటుకోసం 200కోట్ల రూపాయలు ఇచ్చేవారు ఉంటారా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. వాస్తవానికి ఆరేళ్లపాటు స్థిరంగా ఉండే రాజ్యసభ స్థానాలకోసం హెవీ కాంపిటీషన్ ఉంటుంది. పార్టీ అధినేతలు కూడా రాజ్యసభ సీట్ల పంపకాల సమయంలో తీవ్ర అవస్థలు పడుతుంటారు. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేవారితోపాటు.. మొహమాటాలుంటాయి. అందులోనే సామాజిక సమీకరణాలు కూడా చూడాలి. అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశమున్నా కూడా అది సాధ్యం కాకపోవచ్చు. దీంతో అన్నీ బేరీజు వేసుకుని రాజ్యసభ సీట్లు కేటాయిస్తుంటారు.
టీడీపీ హయాంలో కూడా సామాజిక సమీకరణాలకోసం ఒకరిద్దరికి సీట్లు ఇచ్చినా మిగతావన్నీ వ్యాపార వర్గాలకు కేటాయించినవే. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలు టీడీపీపై ఎదురు దాడికి దిగారు. మీ హయాంలో ఏం చేశారంటూ లాజిక్ తీస్తున్నారు. మీరు వ్యాపార వర్గాలకు కేటాయిస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా అని ప్రశ్నిస్తున్నారు. అయితే బీదా మస్తాన్ రావు విషయంలో టీడీపీ ఆరోపణలు ముమ్మరం చేసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన నెల్లూరు లోక్ సభకు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వెంటనే వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు రాజ్యసభ సీటు తెచ్చుకున్నారు. వైసీపీకి రాజ్యసభ సీట్లు బీసీలకు కేటాయించాలనుకుంటే.. ఆ పార్టీలో బీసీలు లేరా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. తమ పార్టీనుంచి వచ్చిన ఇద్దరు బీసీలకు వైసీపీ టికెట్లు కేటాయించిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: