టీడీపీలో గుబులు పుట్టిస్తున్న వైసీపీ బస్సు యాత్ర..

Deekshitha Reddy
ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే వైసీపీ నేతలు జనాల్లోకి వెళ్తున్నారు. దాదాపు ఏపీలో ఎలక్షన్ మూడ్ వచ్చేసినట్టు కనిపిస్తోంది. దీనికితోడు ఇప్పుడు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారు. అంటే దాదాపుగా ఇవి పొలిటికల్ టూర్లుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ మాత్రం కేవలం చంద్రబాబునే నమ్ముకుని ఉంది. మిగతా నాయకులు బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో జనాల్లోకి వెళ్తున్నారే కానీ పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కనిపించడంలేదు. అయితే ఇప్పుడు బస్సు యాత్ర సరిగ్గా టీడీపీ మహానాడుకి అడ్డుగా మారిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహానాడు సమయంలోనే వైసీపీ బస్సుయాత్ర పెట్టుకుంది. మీడియా ఫోకస్ కూడా కేవలం మహానాడుకే పరిమితం కాకుండా చూస్తోంది.
ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్రలో పాల్గొంటారు. మంత్రులు బొత్స సత్యనారాయణ,  ధర్మాన ప్రసాదరావు,  చెల్లుబోయిన గోపాలకృష్ణ.. వీరంతా బస్సు యాత్ర పోస్టర్ ని ఆవిష్కరించారు. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు వైసీపీ మంత్రులు. యాత్రతోపాటు.. ప్రతి రోజు ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ యాత్ర శ్రీకాకుళం నుంచి మొదలవుతుంది. 29వ తేదీన అనంతపురంలో బహిరంగ సభతో ముగుస్తుంది.
వైసీపీ బస్సు యాత్రలో 17 మంది మంత్రులు పాల్గొంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు కూడా వారితోపాటు బహిరంగ సభల్లో పాల్గొంటారు. గతంలో బలహీన వర్గాలకు మంత్రి పదవి ఇస్తే చాలు అనుకునే రోజులు ఉండేవని, కానీ జగన్ హయంలో.. బలహీన వర్గాలకే అన్ని పదవులు ఇస్తున్నారని చెప్పారు నేతలు. వైసీపీ కేబినెట్‌లో 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు ఉన్నారని, జగన్ చెబుతున్న సామాజిక న్యాయం ఇదేనని అన్నారు మంత్రులు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలా పదవులిచ్చే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశామా అంటున్నారు మంత్రులు. జగన్ సామాజిక న్యాయం గురించి మరింత విస్తృతంగా చర్చ జరిగేందుకే తాము బస్సు యాత్ర మొదలు పెట్టినట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: