రాజకీయాల్లో కింగ్ మేకర్ రాయవరం మునుసుబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కోస్తాంధ్ర ప్రాంతానికి ఉన్నంత ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ప్రాంతానికి చెందిన వారు కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రాంతంతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రాంత నాయకులు కీలకమైన పదవులు నిర్వహించారు. మరి కొందరు ఎటువంటి ఉన్నతమైన రాజకీయ పదవులు నిర్వహించకుండానే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు, అటువంటి వారిలో ముఖ్యులు రాయవరం మునుసుబు గా ప్రసిద్ధులైన వుండవిల్లి సత్యనారాయణ మూర్తి.  





రాయవరం మునుసుబు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వుండవిల్లి సత్యనారాయణ మూర్తి ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి గోదావరి జిల్లా లోని రామచంద్రపురం తాలూకా రాయవరం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. కన్న తల్లిదండ్రులు రిమ్మలపూడి నారాయణ మూర్తి , సూరమ్మ గార్లు కాగా చిన్నతనంలోనే తన తల్లి తండ్రి గారైన వుండవిల్లి రామయ్య , చెల్లాయమ్మ దంపతులకు దత్తతగా వెళ్లడంతో వీరిని రాయవరం దత్తుడు అని కూడా ఆ ప్రాంత ప్రజానీకం పిలుచుకుంటుంది. 





ఆనాడు రామచంద్రపురం తాలూకా లో అతిపెద్ద రెవెన్యూ గ్రామాల్లో ఒకటైన వెదురుపాక రెవెన్యూ గ్రామం కింద ఉన్న గ్రామాల్లో ఒకటి రాయవరం. అయితే ఈ వెదురుపాక రెవెన్యూ గ్రామ పరిపాలనా బాధ్యతలు కల మునుసుబు పదవి మాత్రం రాయవరం గ్రామానికి చెందిన సంపన్న రైతు కుటుంబాల్లో ఒకటైన వుండవిల్లి కుటుంబం కింద ఉండేది.వుండవిల్లి రామయ్య గారికి మగ సంతానం లేకపోవడంతో తన కుమార్తె సూరమ్మ చిన్న కుమారుడైన సత్యనారాయణ మూర్తిని దత్తత తీసుకుని తన తదనంతరం మునుసుబు పదవిని అప్పగించారు. 





సత్యనారాయణ మూర్తి తాత రామయ్య ఆకస్మిక మరణంతో అతి పిన్న వయస్సులోనే రాయవరం మునుసుబుగా బాధ్యతలు చేపట్టడంతో స్కూల్ విద్య వరకే పరిమితం కావడం జరిగింది. అయితే, మునుసుబుగా అతికొద్ది కాలంలోనే గ్రామ పరిపాలన మీద పట్టు సాధించి రామచంద్రపురం తాలూకా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే స్థాయికి ఎదగడం జరిగింది. ఈ క్రమంలోనే 1939లో వెదురుపాక గ్రామ కేంద్రంగా ఉన్న మునుసుబు పదవిని రాయవరం గ్రామానికి మార్పించి తాలూకా రాజకీయాల్లో ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. 





చిన్నతనం నుంచే దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ మరియు ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని మునుసుబు ఏంతో అభిమానించే వారు, ఆ అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరి తన చివర శ్వాస విడిచిపెట్టె వరకు మార్గ మధ్యలో ఎన్ని ప్రలోభాలు ఎదురైనా ఆ పార్టీతోనే కొనసాగారు.దేశ స్వతంత్రం రాక ముందు నుండే కాంగ్రెస్ పార్టీని  రామచంద్రపురం తాలూకాలో బలోపేతం చేసేందుకు అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని రాజకీయంగా ప్రోత్సహించడం జరిగింది. 





ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఎదుగుతూ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వర్గాలైన సంపన్న జమీందారి వర్గాల ఆధిపత్యాన్ని గండికొట్టడంతో కీలకంగా వ్యవహరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న పెనుమార్పులు దృష్ట్యా మునుసుబు రాజకీయంగా వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తూ వచ్చారు. అయితే, జిల్లా రాజకీయాల్లో మాత్రం తన పట్టును కోల్పోకుండా చూసుకుంటూ వచ్చారు. 





ఆనాటి కాంగ్రెస్ కురువృద్ధుడు కళా వెంకట్రావు శిష్యుడిగా జిల్లా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ తరపున ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడ్డుపెట్టారు. ఆనాటి రాష్ట్ర రాజకీయాల్లో బలవంతులైన నీలం సంజీవ రెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, పిడతల రంగారెడ్డి , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఏ.సి.సుబ్బారెడ్డి లు రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తున్న సమయంలో మునుసుబు గారు తటస్థంగా వ్యవహరిస్తూనే పార్టీ లో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టపరిచేందుకు కృషి చేశారు. 





ఆనాటి ముఖ్యమంత్రి సంజీవ రెడ్డి పక్షపాత రాజకీయాలను విభేదించిన కాసు బ్రహ్మానంద రెడ్డి వర్గంలో మునుసుబు గారు కూడా కీలకంగా వ్యవహరించారు. సంజీవ రెడ్డి వర్గం యొక్క రాజకీయాలు కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో మునుసుబు ప్రాభవాన్ని తగ్గించే క్రమంలో జిల్లాపరిషత్ ఉపాధ్యక్షుడుగా ఉన్న వీరిని అందులో నుండి తొలగించి రామచంద్రపురం తాలూకా కే పరిమితం చేసే దిశగా పావులు రామచంద్రపురం సహకార బ్యాంకు అధ్యక్ష బాధ్యతలకే పరిమితం చేయడంతో వీరు రాష్ట్ర స్థాయిలో బ్రహ్మానంద రెడ్డి వర్గం వైపు మొగ్గు చూపారు.  




బ్రహ్మానంద రెడ్డి వర్గంలో ముఖ్య నాయకుడిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి గా పదవి బాధ్యతలు చేపట్టి పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. 1964లో  ముఖ్యమంత్రి గా కాసు బ్రహ్మానంద రెడ్డి ఎన్నికవ్వడంలో కీలకమైన పాత్ర పోషించారు. కాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం   రాజకీయ పదవులు నిర్వహించకుండానే అటు గోదావరి జిల్లాల్లో మరియు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1967, 1972, 1978 అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచి పాత కాంగ్రెస్ మరియు ఇందిరా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంలో కీలకమైన పాత్ర పోషించారు. 




1977లో దేశవ్యాప్తంగా జనతాపార్టీ ప్రభంజనం ఉన్న సమయంలో అనేక మంది కాంగ్రెస్ పాత కాపులు మొత్తం జనతా పార్టీకి జై కొట్టడంతో సందిగ్ధంలో పడిన ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఆమెకు అండగా నిలుస్తూ వచ్చారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చే బాధ్యతను భుజానికెత్తుకొని అన్ని తానై వ్యవహరించి పార్టీని విజయతీరాల వైపు నడిపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఉన్నతమైన రాజకీయ పదవులు ఆశించలేదు. 





అయితే, ఆనాటి స్థానిక పరిపాలన వ్యవస్థలో కీలకమైన సమితి ఎన్నికల్లో రాయవరం సమితి అధ్యక్షుడుగా అభిమానుల కోరిక మేరకు మునుసుబు పోటీ ఘన విజయాన్ని నమోదు చేశారు.రాయవరం సమితి అధ్యక్షుడుగా ఉంటూనే జిల్లా , రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును నిలుపుకుంటూ వచ్చారు.1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత పార్టీలోకి రావాలని ఎన్టీఆర్ స్వయంగా వీరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికినా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు. 





 రాయవరం మునుసుబుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆ వ్యవస్థను రద్దు అయ్యేవరకు అంటే సుమారు 60 సంవత్సరాలు రాయవరం గ్రామానికి మునుసుబుగా వ్యవహరించిన వీరు తన హయాంలో రాయవరం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు.1960 దశకంలోనే ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించడం, రోడ్ల నిర్మాణంతో పాటుగా విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి పరిచారు. గ్రామంలో పలు రకాల సహకార పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 





మునుసుబు రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టక పోయినా గోదావరి జిల్లాల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. సమాజంలో అట్టడుగు స్థాయి వర్గాలైన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి  ఉపాధి కల్పన, వ్యవసాయం చేసుకోవడానికి బంజరు భూముల పంపిణీ చేయించారు. అలాగే, రోడ్లు నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సహకార వ్యవస్థల బలోపేతం , ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టారు. 





మునుసుబు విద్యాభివృద్ధి కోసం కీలకంగా కృషి చేశారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్న అంతరాలు తొలగించడం సాధ్యం అని నమ్మిన వ్యక్తి కావడంతో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలో జిల్లా పరిషత్ నిధులతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో పాఠశాలలు స్థాపించారు.పాఠశాల విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకారవేతనాలు మంజూరు చేయించడం జరిగింది. ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు తన సొంత నిధులతో రామచంద్రపురం పట్టణంలో వి.ఎస్.యం డిగ్రీ కళాశాలను స్థాపించి ఎందరో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య చెప్పించారు. ఈరోజు ఆ కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు దేశ , విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.  





రాజకీయాల్లో అవినీతికి, బంధుప్రీతికి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన వీరు ఎందరో బడుగు బలహీన మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న గోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు వీరి శిష్యులు. 





రాయవరం మునుసుబు గారిది రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం, గోదావరి ప్రాంతంలో ఆది నుండి బలమైన జమీందారి మరియు రాజకీయ కుటుంబాలకు చెందిన వారికి దక్కని అశేషమైన ప్రజాభిమానం వీరి సొంతం. రాజకీయ వ్యూహాలను రచించడంలో దిట్టగా పేరు గడించిన వీరు వ్యక్తిగతంగా సౌమ్యులు.  రాజకీయాల్లో వీరితో సైద్ధాంతికంగా విభేదించిన ఆనాటి కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలకు చెందిన నాయకులతో సైతం సన్నిహితంగా మెలిగేవారు.ఆయన మరణించి సుమారు మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా కూడా  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: