పేపర్ లీక్ వ్యవహారంపై మాటల యుద్ధం..!
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాలు ఎక్కడ లీకయ్యాయో పోలీసులు విచారణ చేస్తున్నట్టు చెప్పారు. తప్పుచేసిన వారెవరైనా.. అరెస్ట్ చేస్తారు. చట్టం, పోలీసులు వారి పని వారు చేసుకువెళ్తారని చెప్పారు. తప్పు చేయలేదని వారు నిరూపించుకోవాలన్నారు బొత్స సత్యనారాయణ. అక్రమాలు జరగకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారని మంత్రి ప్రశ్నించారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫమైందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నారాయణ స్కూలుకు పేపర్ లీక్ చేస్తే.. లీక్ చేసి, అన్ని స్కూళ్లకు పంపారు. ఆ తర్వాత నెంబర్ 1 నారాయణ అనే ప్రకటనలు ఇస్తారు అని ఆరోపించారు. పేపర్లు లీక్ చేస్తే నెంబర్ వన్ వస్తుంది. ఇలాంటి స్కామ్ లు చేసి విద్యాసంస్థలు నడుపుతున్న నారాయణను అరెస్ట్ చేస్తే తప్పేంటి.. ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
మరోవైపు టీడీపీపై ఆరోపణలు గుప్పించారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రాబోయే ఎన్నికల్లో సమాధి కాబోతుందంటూ జోస్యం చెప్పారు. చంద్రబాబు యాత్రలు అసమర్థుడి ఆఖరి అంతిమయాత్రఅంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ పార్టీ క్యాడర్ లో ఎక్కడా అసంతృప్తి చెందలేదన్నారు. పండగ వాతావరణంలో ప్రభుత్వం ప్రకటించిన గడగడపకూ వైసీపీ కార్యక్రమం చేపట్టబోతున్నామని.. తమలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటామన్నారు.