ఢిల్లీ : అతిచేస్తే ఇలాగే ఉంటుంది..అసలు విషయం ఇది

Vijaya



ఏ విషయంలో అయినా అతిచేస్తే గతిచెడుతుంది అనేది సామెత. అది మనుషులకే కాదు రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ చేసిన అతితో  చివరకు గతిచెడి రివర్సు కొట్టింది. ఇంతకీ విషయం ఏమిటంటే నేపాల్లోని ఒక నైట్ పబ్ లో రాహుల్ గాంధి ప్రత్యక్షమయ్యారు. అదికూడా చైనాకు చెందిన రాయబారితో. అదికూడా మహిళా రాయబారితో పబ్ లో ఉండగా ఎవరో ఫొటులు, వీడియోలు తీసి వైరల్ చేశారు.



ఇంకేముంది రాహుల్ ను ఎప్పుడెప్పుడు గబ్బుపట్టిద్దామా అని కాచ్చుక్కూర్చునున్న బీజేపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆ వీడియోలను ట్విట్టర్లో పెట్టి నోటికొచ్చిందేదో మాట్లాడేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే ఎంజాయ్ చేయటానికి నేపాల్ పబ్బుల్లో రాహుల్ గడపటం ఏమిటి ? అందులోను చైనాకు చెందిన మహిళా రాయబారితో పబ్బులో ఏంపని ? అంటు ఏదోదే మాట్లాడేశారు. బీజేపీ ఆరోపణలు, విమర్శలను కాంగ్రెస్ నేతలు ఎంతగా సమర్ధించుకుందామని చూసినా సాధ్యంకాలేదు.



ఇంతలో అప్పుడెప్పుడో బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఏదో పార్టీలో ఓషాంపైన్ బాటిల్ ఓపెన్ చేస్తున్న వీడియోలు, ఫొటోని పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. జవదేకర్ ఫొటోలను వైరల్ చేశారు. దాంతో బీజేపీ నేతలు కాస్త డిఫెన్స్ లో పడిపోయారు. సరే ఈ గొడవలతో రోజు గడిచిపోయిన తర్వాత రాహుల్ పబ్బు విషయంలో అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి.




రాహుల్ నేపాల్ వెళ్ళింది ఒక స్నేహితురాలి వివాహానికి. పబ్ లో రాహుల్ తో పాటు కనిపించింది చైనా రాయబారి కాదు. సదరు మహిళ పేరు రాబిన్ శ్రేష్ఠ. ఆమె కూడా పెళ్ళికూతురు స్నేహితురాలే. ఇద్దరు కూడా పెళ్ళికూతురు ఆహ్వానం మేరకే నేపాల్ చేరుకున్నారు. అసలు విషయం బయటకు వచ్చేసరికి తలలు ఎక్కడ పెట్టుకోవాలో బీజేపీ నేతలకు తెలియలేదు. అయినా రాజకీయ నేతలన్నాక ప్రైవేటు లైఫ్ ఉండదా ? ఎవరినీ కలవకూడదా ? ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుకాకూడదా ? నేపాల్ పబ్ లో రాహుల్ ను చూసిన ఎవరో వీడియో తీసి పెట్టేయగానే ముందు వెనకా చూసుకోకుండానే బురద చల్లేయటమేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: