ఇంతకీ పేపర్ లీకయినట్టా..? కానట్టా..?

Deekshitha Reddy
టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంలో 12మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే అదే సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అసలు పేపర్ లీక్ కాలేదంటున్నారు. లీక్ విషయంలో ఆయన ఓ లాజిక్ చెబుతున్నారు. టెన్త్ క్లాస్ పరీక్షలు మొదలయ్యే సమయం 9.30 గంటలకు అని, అంతకు ముందే పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ అంటారని, ఆ తర్వాత వస్తే దాన్ని లీక్ అని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు బొత్స. పరీక్ష మొదలయ్యాక పేపర్ ని ఫొటో తీసి బయటకు పంపించారని కేవలం కుట్రకోణంలోనే దీన్ని చూడాలని చెబుతున్నారు.
ఆ ఛానెళ్లు చూడొద్దు..
ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ మూడు ఛానెళ్లను చూడొద్దని, రెండు న్యూస్ పేపర్లను చదవొద్దని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ. వాటిని చూడటం వల్ల అనవసర ఆందోళనకు గురవ్వాల్సిన అవకాశముంటుందని హెచ్చరించారు. ఏపీలో టెన్త్ పేపర్లు లీక్‌ అయినట్లు ఎల్లో మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు బొత్స. తప్పుడు ప్రచారం చేస్తోన్న ఎల్లో మీడియాను ఎవరూ చూడొద్దని, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చూడొద్దని విజ్ఞప్తి చేశారాయన. పేపర్ లీక్ అయినట్టు వార్తలిచ్చి విద్యార్థులను మనో వేదనకు గురిచేయడం సరికాదన్నారు మంత్రి బొత్స.
పరీక్ష మొదలైన తర్వాత పరీక్ష పత్రం  ఫోటోలు బయటికి వస్తే లీక్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు బొత్స సత్యనారాయణ. బాధ్యులపై చర్యలకు ఆదేశించామని ఆయన మీడియాకు వివరించారు. తెలుగు, హిందీ పేపర్ ఎక్కడా లీక్ కాలేదని అన్నారు. ఇలా పేపర్ లీక్ అయిందని చెప్పడం వల్ల వాళ్లకి ఏమొస్తుందని ప్రశ్నించారు. నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్, ఎన్నారై స్కూల్ కి చెందిన సుధాకర్‌  అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు మంత్రి బొత్స. వారితోపాటు మరికొందర్ని కూడా అరెస్ట్ చేశామన్నారు. ఆయా స్కూళ్ల పేర్లు ఎలా బయటకొచ్చాయని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు, లోకేష్ ఇప్పుడేమని సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: