నేటి నుంచి ఏపీలో బీజేపీ యుద్ధభేరి..?

Chakravarthi Kalyan
ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే.. ఎంత ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు  ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి ప్రాంతాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను వేసేందుకు బీజేపీ నిర్ణయించింది. ప్రతి మూడు నుంచి ఆరు పోలింగ్ బూత్ లను ఒక శక్తి కేంద్రంగా గుర్తించి, వాటికి బాధ్యులను నియమించబోతోంది.

బీజేపీ కూడా పోలింగ్ బూత్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని తమ శ్రేణులను ఆదేశించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాలు పార్టీ శక్తి కేంద్రం స్థాయిలో ఎనిమిది వేల ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు సోము వీర్రాజు చెప్పారు. ఇవాళ  ఉత్తరాంధ్ర జోనల్ సమావేశాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం విజయనగరం, అరకు,పాడేరు, పార్వతీపురం జిల్లా నుంచి ఎంపిక చేసిన పార్టీ శ్రేణులు పాల్గొంటారు.

అలాగే ఈ నెల 28 న రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ సమావేశం జరగబోతోంది. ఇందులో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, కృష్ణాజిల్లాల నేతలు పాల్గొంటారు. అలాగే 29 న గుంటూరులో జరుపనున్న కోస్టల్ జోన్  సమావేశానికి విజయవాడ, గుంటూరు, నరసరావుపేట,బాపట్ల,-ఒంగోలు,నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన నేతలు పాల్గొంటారు. ఈ నెల 30 న అనంతపురంలో రాయలసీమ జోన్ మీటింగ్ ఉంది. ఇందులో అనంతపురం, హిందూపురం, చిత్తూరు, కడప,రాజంపేట, కర్నూలు, నంద్యాల నేతలు పాల్గొంటారు.  ఈ ప్రతి జోనల్ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతోపాటు లేదా ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు సోము వీర్రాజు చెబుతున్నారు. మీటింగులైతే జోరుగానే ఉన్నాయి. మరి ఇవి ఎంత వరకూ సఫలం అవుతాయో.. పార్టీని బలోపేతం చేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: