కొడాలి ఫ్రస్టేషన్.. మొత్తానికి ఇలా బయటపడింది..

Deekshitha Reddy
మాజీ మంత్రి కొడాలి నాని మంత్రి పదవి పోయిన తర్వాత గుడివాడకు పెద్దగా రాలేదు. దాదాపుగా ఆయన తన సొంత నియోజకవర్గానికి దూరంగా రెండు వారాలపాటు ఉండిపోయారు. హైదరాబాద్ లోనే మకాం పెట్టారు. ఆయన గుడివాడ ఎందుకు రాలేదు, సొంత నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉన్నారని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. కొడాలికి మంత్రి పదవి పోయిందన్న బాధ ఉందా, కొందరికి పదవులు ఇలనే ఉంచి, తనని తీసేయడంతో ఆయన బాధపడుతున్నారా అనే అనుమానం అందరిలో ఉంది. వీటన్నిటికీ ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా గుడివాడ పర్యటనకు వచ్చిన ఆయన బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం తన మనసులో మాట బయటపెట్టారు.
మంత్రి పదవి పోయిందన్న ఫ్రస్టేషన్ కొడాలి నానిలో కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. అందుకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనం అని చెబుతున్నారు. తనను ఇకపై  మాజీ మంత్రి అని పిలవొద్దని, తనకు గుడివాడ ఎమ్మెల్యేగా పిలిపించుకోవడమే ఇష్టమని చెప్పారు కొడాలి నాని. దొండపాడు గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం ఎంతకైనా దిగజారతారని, సొంతవారికే వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు నాని. మంత్రి పదవి తనకు వెంట్రుక ముక్కతో సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపోతే తాను బాధపడను అని, ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానని స్పష్టం చేశారు నాని. సీఎం జగన్ తో కలిసి నడవడం, ఆయన నాయకత్వంలో పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయ్యేదని అన్నారు నాని. చంద్రబాబు, ఆయన సొంత పుత్రుడు, దత్త పుత్రుడు.. అందరూ కలసి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్చుకోలేక రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి పదవినుంచి తొలగించిన తర్వాత కొడాలి నానికి ప్రభుత్వం ఏపీ స్టేట్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ గా అవకాశం కల్పించింది. దీనికి కేబినెట్ హోదా ఉంది. దీనికి సంబంధించి ఏపీ స్టేట్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు త్వరలో ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే మంత్రి పదవి పోయిన తర్వాత కొడాలి తొలిసారిగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: