ఏలూరు ఘోరానికి అసలు కారణం అదే..!

Deekshitha Reddy
ఏపీలో తెల్లవారే సరికి మరో ఘోరం జరిగిపోయింది. అర్థరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా అందరూ భయాందోళనలకు గురయ్యారు.
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలోని నాలుగో యూనిట్‌ లో గ్యాస్‌ లీకవడంతో మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయినట్టు తెలుస్తోంది. ఈ మంటల ధాటికి ఇప్పటి వరకు ఆరుగురు దుర్మరణంపాలయ్యారు. మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ఐదుగురు సజీవదహనం అయ్యారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇక అక్కడే పనిచేస్తున్న మరో  13 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారందర్నీ వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది మొదటగా నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ 13మందిలో కొంతమంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు వెంటనే..
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన వివరాలు అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌  సిబ్బందిని కూడా వెంటనే రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొంతసేపటి తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినా ఆ లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆరుగురు చనిపోగా, 13మంది ప్రాణాలకోసం పోరాడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 150 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.
కారణం ఏంటి..?
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఔషధాల్లో వాడే పొడిని తయారు చేస్తుంటారు. గతంలో ఇలాంటి పెద్ద ప్రమాదాలు ఎప్పుడూ ఇక్కడ జరగలేదని తెలుస్తోంది. ఈసారి గ్యాస్ లీకవడంతో మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు మృత్యువాతపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. వివరాలు సేకరించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: