జగనన్న ఇళ్ల స్థానంలో మోదీ అన్న ఇళ్లు..!!

Deekshitha Reddy
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది అని ఇటీవల కాలంలో చాలా సార్లు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. తాజాగా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. ఏపీలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లకు.. మోదీ అన్న ఇళ్లు అని పేరు మారుస్తామంటున్నారు. ఆమేరకు ఆయా కాలనీల వద్దకు వెళ్లి ఫ్లెక్సీలు ఏర్పు చేస్తామంటున్నారు వీర్రాజు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని, అయితే కేంద్రానికి ఇవ్వాల్సిన క్రెడిట్ మాత్రం ఇవ్వడంలేదని మండిపడుతున్నారు వీర్రాజు. అదే సమయంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పడతామని చెప్పారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనపోరు యాత్ర మొదలు పెట్టబోతున్నట్టు తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. విశాఖ పట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు వీర్రాజు. సాగునీటి ప్రాజెక్ట్ ల సమగ్ర పరిశీలనకు తమ బృందం వస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న వంశధార సహా ఇతర ప్రాజెక్టులపై సమగ్ర పరిశీలన పత్రం విడుదల చేస్తామని కూడా తెలిపారాయన. ఉత్తరాంధ్ర ప్రజల్ని వైసీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో మోసం చేస్తోందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తాము జనపోరు యాత్ర మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. సంక్షేమం పేరుతో ఏపీ సీఎం జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు వీర్రాజు.
ఏపీ బీజేపీ ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై మాటల దాడి పెంచింది. ఎన్నికలకు టైమ్ దగ్గరపడే కొద్దీ ఏపీలో బీజేపీ ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. జనసేన మాత్రం టీడీపీతో పొత్తులోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ మూడు పార్టీలు కలిసి 2024లో వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశముంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలపై వరాల జల్లు కురిపించి అధికారంలోకి రాగానే హామీలను మరచిపోయారని విమర్శించారు కన్నా. రైతులకు 9 గంటలు నిరాటంకంగా విద్యుత్ ఇస్తామని చెప్పిన కన్నా, ఇప్పుడు ఆ హామీని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7సార్లు కరెంట్‌ ఛార్జీలను పెరిగాయని, ప్రజలపై ఆమేరకు భారం పెరిగిందని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. నవరత్నాల పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసగిస్తోందని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: