40 ఏళ్ళ లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయలేమిటి ?

తెలుగు వారి ఆత్మగౌరవం పరిరక్షణ నినాదంతో 1982 మార్చి 29 న అంటే 40 ఏళ్ల క్రితం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా దేశవ్యాప్తంగా కీర్తి గడించిన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పదవుల కోసమో , అధికారం కోసమో పుట్టిన పార్టీ కాదు , తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీగా తెలుగుదేశం పార్టీని ఆయన అభివర్ణించారు. అసలు ఇన్నేళ్ల ప్రయాణం లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయలేమిటి ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేసింది ? 


 


1980వ దశకంలో సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు , తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా!  అన్న నినాదాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని సమూలంగా  తన వైపు తిప్పుకున్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన  కేవలం 8 నెలల్లోనే అధికారంలోకి రావడం ఆనాటి భారత దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. 





1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలను, రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పలు పథకాలు తర్వాత కాలంలో దేశంలో పలు అధికార ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాయి అంటే అతిశయోక్తి కాదు. తెలుగు నాట సంక్షేమ పథకాలు ఆవిర్భావం తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది.స్వతంత్ర భారత దేశంలో ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం తపించిన పార్టీగా భారత దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.  




పేదవాడు పట్టేడన్నం తినేందుకు ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం , పేదల కోసం పక్కా గృహాలు, సగం ధరకే జనతా వస్త్రాలు, ఉపాధి హామీ పథకం, నీరు పేదలకు నెలకు 30రూపాయల పింఛన్ , ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55 వేల మంది వితంతు మహిళలకు 50 రూపాయిలు పింఛన్ , అసంఘటిత కార్మికులకు 30 రూపాయలకు పింఛన్ అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 




రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, నీటి తిరువా రద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగు నీటి పారుదల వ్యవస్థ పూనర్నిర్మాణం, సన్న చిన్నకారు రైతుల భూమి శిస్తూ రద్దు ,రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన వంటి పలు పథకాలను విజయవంతంగా అమలు చేయడం జరిగింది.  






సామాన్య ప్రజానీకానికి విద్యా, వైద్య  సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యం తో ప్రతి మండల కేంద్రం లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , జిల్లా పరిషత్ హైస్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది.విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది .అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో ప్రాథమిక స్కూళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సాంకేతిక , వైద్య విద్యలలో విప్లవాత్మక సంస్కరణలు , ఎంసెట్ నిర్వహణ , క్యాపిటేషన్ ఫీజుల రద్దు మొదలైనవి పార్టీ సాధించిన విజయాలు. 






తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి చేరువచేసిన ముఖ్యమైన పాలనా సంస్కరణ మండల వ్యవస్థ నిర్మాణం. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, మెరుగైన సేవలు అందించేందుకు అప్పటి వరకు పాలన వ్యవస్థ లో బలంగా ఉన్న గ్రామ కరణాల వ్యవస్థ రద్దు ఒక సంచలనం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికార వికేంద్రీకరణతో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు, మండల యూనిట్ గా గ్రామాల అభివృద్ధికి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.  






తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసింది. దేశంలో మొదటి సారిగా ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించడంతో పాటు ఆర్థిక స్వాలంబన దిశగా సాగేందుకు డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేయడం జరిగింది. విద్య , ఉపాధి , రాజకీయ, సామాజిక రంగాల్లో వారికి అవకాశాలు కల్పించి సమాజంలో వారికి   సముచితమైన గౌరవం దక్కడంలో కీలకమైన పాత్ర వహించిన ఘనత తెలుగుదేశం పార్టీ సొంతం.  






బడుగు ,బలహీన, అణగారిన గిరిజన, దళిత వర్గాలకు చెందిన వారికి ఆర్థిక , సామాజిక, రాజకీయ, విద్య , ఉపాధి రంగాల్లో అపారమైన అవకాశాలు, సామాజిక భద్రత కల్పించి వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న పార్టీగా తెలుగుదేశం నిలిచిందని సమాచారం.  




  తెలుగు నాట ఆర్థిక సంస్కరణలు యొక్క ఫలాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లో తెలుగు దేశం పార్టీది కీలకమైన పాత్ర. విద్యుత్ సంస్కరణలు , సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిపాలన యంత్రాంగంలో సంస్కరణలు, ఐ.టి రంగం అభివృద్ధి వంటివి ఆ పార్టీ హయాంలోనే జరిగాయి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను విశ్వ నగరంగా రూపాంతరం చెందింది కూడా ఆ సమయంలోనే.







 కేవలం తెలుగు నాట రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం తెలుగుదేశం పార్టీ కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 8 వ లోక్ సభ లో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా 1989లో నేషనల్ ఫ్రoట్, 1996 లో యునైటెడ్ ఫ్రoట్, 1998,1999లలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించింది.  






సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురవస్థలను రద్దు చేసి విప్లవాత్మక విధానాలను పరిపాలన రంగంలో పాదుకొలిపి యావత్ భారత దేశ రాజకీయాల్లో అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలను, గడ్డు పరిస్థితులు చవిచూసింది. అయినప్పటికీ వాటిని తట్టుకొని పార్టీ ముందుకు సాగుతూనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: