ఉత్తరాంధ్ర : వైజాగ్ అంటే పవన్లో ఇంత మంటుందా ?

Vijaya


ఉత్తరాంధ్ర ప్రత్యేకించి వైజాగ్ జనాలంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎంత కసుందో అర్ధమైపోతోంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో ఎంతమాత్రం వెనక్కు తగ్గేదేలే అని ప్రకటించినా పవన్ ఏమీ మాట్లాడటంలేదు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపైన  ఆరోపణలు చేస్తుండటమే విచిత్రం. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో జగన్ ప్రభుత్వానికి ఎంతమాత్రం సంబంధంలేదు.  స్టీల్ ఫ్యాక్టరీ పూర్తిగా కేంద్రానిదే అన్న విషయం అందరికీ తెలుసు.



తన ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరిస్తున్నపుడు రాష్ట్రం ఎన్నిఅభ్యంతరాలు వ్యక్తంచేసినా ఉపయోగముండదు. ఈ విషయం పవన్ కు బాగా తెలుసు. పైగా ప్రైవేటీకరించేబదులు తనకు ఇచ్చేయమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగంలేకపోయింది. వాస్తవం ఇదైతే పవన్ మాత్రం 24 గంటలూ జగన్ను మాత్రమే నిందిస్తున్నారు.



విచిత్రమేమిటంటే ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడి ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాటకూడా అనటంలేదు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తప్పని ఒకసారి కూడా పవన్ చెప్పలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా, ఎన్ని ఆందోళనలు చేస్తున్నా కేంద్రం మాత్రం తన నిర్ణయానికే కట్టుబడుంది. తాజాగా పార్లమెంటులో ఉక్కుశాఖ మంత్రి రామచంద్రప్రసాద్ సింగ్ మాట్లాడుతు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేదేలే అని స్పష్టంగా ప్రకటించేశారు.



సరే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఏమి చేస్తోందనే విషయాన్ని పక్కనపెట్టేస్తే మిత్రపక్షంగా పవన్ ఏమి చేస్తున్నాడన్నదే ప్రధానం. మిత్రపక్షంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కమాటా మాట్లాడని పవన్ ఎంతసేపు జగన్నే తప్పుపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే 2019 ఎన్నికల్లో గాజువాకలో తనను ఓడించినందుకు వైజాగ్ జనాలపై పవన్ కు బాగా మంటున్నట్లే ఉంది. అందుకనే కేంద్రం నిర్ణయంపై ఏ విధంగా కూడా స్పందించటంలేదు. మొత్తానికి వైజాగ్ జనాలపై ఉన్న కసిని పవన్ ఈ విధంగా తీర్చుకుంటున్నట్లే ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: