రూపాయికే ఇడ్లీ, బోండా.. ఇది ప్రభుత్వం పథకం కాదు..

Deekshitha Reddy
రోడ్డుపక్కన కాకా హోటల్ లో కూడా ఇడ్లీ పది రూపాయలు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్స్ లో 50, 100 ఎంత చెప్పినా కొనాల్సిందే, తినాల్సిందే. కానీ ఓ హోటల్ లో మాత్రం ఇంకా ఇడ్లీ రూపాయికే దొరుకుతోంది. నైన్టీస్ లోకి వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా ఇడ్లీ అక్కడ రూపాయే. బొండా ఒకటి ఒక రూపాయ్. మరి అమ్మేవారికి ఏం మిగులుతుందనే కదా మీ సందేహం. అది తెలుసుకోవాలంటే ఈ రాంబాబు ఇడ్లీ కథ చదవాల్సిందే.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరులో రూపాయ్ ఇడ్లీ గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ఆ హోటల్ యజమాని పేరు చిన్ని రామకృష్ణ. అందరూ రాంబాబు అని పిలుచుకుంటారు. 16 ఏళ్లుగా ఆయన అక్కడ అదే వ్యాపారం చేస్తున్నారు. ఆర్బీ కొత్తూరు గ్రామంలో జనతా హోటల్ నడుపుతున్నారు రాంబాబు. ఒక్క రూపాయికే ఇడ్లీ..ఒక్క రూపాయికే మైసూర్ బోండా ఈ హోటల్ ప్రత్యేకత. ఇంత చౌకగా వస్తుంటే కస్టమర్లు ఊరుకుంటారా. తెల్లారగానే అక్కడ క్యూ కట్టేస్తారు. చుట్టుపక్కల 10ఊళ్ల గ్రామస్తులు సైతం రాంబాబు హోటల్ కి వచ్చి చౌకగా ఇడ్లీ తీసుకెళ్తుంటారు.
తెల్లవారు ఝామున ఐదింటికే టిఫిన్ రెడీ అవుతుంది. దీంతో పొలం పనులకు వెళ్లేవారు చద్దన్నం మానేసుకుని రాంబాబు హోటల్ లో ఇడ్లీ కట్టించుకుని వెళ్తారు. చుట్టు పక్కల ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు సైతం ఇక్కడికే వచ్చి టిఫిన్ చేస్తారు, తమ స్నేహితులకు టిఫిన్ కట్టించుకుని వెళ్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. చాలామంది ఇక్కడికి వచ్చి వేచి చూసీ చూసీ తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు రాంబాబు.
ఎందుకీ ఆలోచన..
పదహారేళ్ల క్రితం హోటల్ పెట్టిన రాంబాబు అప్పట్లో ఇడ్లీ అర్థ రూపాయికి అమ్మేవాడు. ఆ తర్వాత రూపాయికి పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేటు పెచంలేదు. దీంతో రాంబాబు హోటల్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రోజుకి 400మందికి పైగా కస్టమర్లు తమ దగ్గరికి వస్తుంటారని చెబుతారు రాంబాబు. కస్టమర్ల సంఖ్య ఎక్కువ కావడంతో లాభాలు కూడా వస్తాయని చెబుతారు. ఆ ఊరిలో మిగతా హోటళ్ల నిర్వాహకులు రాంబాబుని టిఫిన్ రేటు పెంచాలని ఒత్తిడి చేసినా ఆయన వినలేదట. సొంత లాభం కొంత మానుకోలేదు కానీ, కస్టమర్లను ఆకట్టుకోవడంలో మాత్రం రాంబాబు నెంబర్ 1 అని నిరూపించుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: