ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులకు అక్కడే వసతి..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ లోని 200లకు పైగా భారతీయ విద్యార్థులకు రాయబార కార్యాలయ అధికారులు ఆశ్రయం కల్పించారు. కీవ్ రాయబార కార్యాలయానికి సమీపంలోని ఓ పాఠశాలలో వీరికి వసతిని సమకూర్చారు. అక్కడ విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కల్పించినట్టు అధికారులు ఓ వీడియో విడుదల చేశారు. పర్మీషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచించారు.
మరోవైపు ఉక్రెయిన్ యుద్ధ భయాలతో తెలుగు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వదేశానికి తీసుకెళ్లాలని తెలుగు విద్యార్థిని జాయిస్ సింధియా విజ్ఞప్తి చేసింది. హాస్టళ్లలో తలదాచుకుంటున్న తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నట్టు పేర్కొంది. సాధారణంగా భారత్ వెళ్లేందుకు 30వేల రూపాయలు ఉండే ఫ్లైట్ టిక్కెట్ ధర అమాంతం పెంచి 60వేల రూపాయలు చేశారని ఆరోపించింది. ఆహారం, సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొంది.
ఇక ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ మూసివేసిన కారణంగా షెడ్యూల్ చేసిన ప్రత్యేక విమానాలు రద్దయినట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఉక్రెయిన్ లోని భారతీయులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. మరింత సమాచారం కోసం పౌరులు రాయబార కార్యాలయం వెబ్ సైట్, సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని సూచించింది. కొన్ని ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.
మరోవైపు భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి ఐగర్ పోలికా ఇండియా మద్దతు కోరారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను పరిష్కరించగల శక్తి భారత్ కు ఉందన్నారు. భారత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రధాని మోడీ ప్రపంచంలోని శక్తివంతమైన గొప్ప నాయకుల్లో ఒకరని చెప్పారు. ప్రస్తుత సమయంలో భారత్ తన తటస్థ వైఖరిని వీడి ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

భారతీయ విద్యార్థులు సహా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యాలో శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటున్నట్టు చెప్పారు. యుద్దాన్ని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు.
 






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: