ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ న్యూస్..!

NAGARJUNA NAKKA
కరోనాతో మరింత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకురావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వారం రోజుల్లో 70వేల కరోనా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. ఆఫ్రికాలో 83శాతం జనాభాకు కోవిడ్ టీకాలు అందలేదని పేర్కొన్నారు. అయితే మనం కలిసికట్టుగా ఉంటే దీన్ని అంతం చేయొచ్చని వెల్లడించారు.
అంతేకాదు కరోనా కేసులు తగ్గుతున్నాయని టెస్టులను తగ్గించడం ఏ మాత్రం మంచిది కాదని ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ ను కట్టడి చేయడానికి, కొత్త వేరియంట్లు గుర్తించేందుకు.. ప్రాణ నష్టం తగ్గించేందుకు టెస్టులు కీలకమని తెలిపింది. వేగంగా.. ఖచ్చితమైన ఫలితాలను చూపించే కిట్ లను వాడాలని పేర్కొంది. వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాలని సూచించింది.
మరోవైపు మన దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుంది. ఇప్పటిదాకా 2కోట్ల మంది 15 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సుగల యువతకు రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తి అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. టీనేజర్లు ఉత్సాహంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 15 నుండి 18ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేసేందుకు జనవరి 1నుంచి రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది.
ఇక భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19వేల 968 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ తో 673మంది మరణించారు.48వేల 847 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2లక్షల 24వేల 187 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో 1.668శాతానికి కరోనా కేసుల రేటు తగ్గింది. ఇప్పటి వరకు 175.37కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి కానీ.. భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశముందని ప్రపంచఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలు కరోనా నిబంధనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: