అమరావతి : జగన్-చంద్రబాబు మధ్య ఇంత తేడావుందా ?

Vijaya


ఉద్యోగులతో డీల్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబునాయుడు మధ్య ఎంత తేడా ఉందో ఇపుడు అందరికీ అర్ధమవుతోంది. పీఆర్సీ అమలు విషయంలో తాజాగా ఉద్యోగ, ఉపాధ్యాయులు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇదే విషయమై చంద్రబాబు మాట్లాడుతు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమన్నా తీవ్రవాదులా అరెస్టులు చేయటానికి అంటు మండిపడ్డారు. ఒక్కసారిగా చంద్రబాబుకు యూనియన్ల మీద ప్రేమ పొంగుకొచ్చేసింది.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అసలు యూనియన్లు అన్నవే లేకుండా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు. గట్టిగా మాట్లాడితే తోకలు కట్ చేసేస్తానని యూనియన్ నేతలను బెదిరించిన ఘటనలు చాలానే ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేసిన రైతులపై బషీర్ బాగ్ లో కాల్పులు జరిపించిన విషయం జనాలకు ఇంకా గుర్తుంది. అలాగే ఆందోళన చేసిన డ్వాక్రా అంగన్వాడీ, ఆశా వర్కర్లపైకి వాటర్ కానన్లు ప్రయోగించటం, గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది.



ఇక ప్రస్తుత ఆందోళనలు తీసుకుంటే ఛలో విజయవాడ కార్యక్రమంలో ఎక్కడా ఎవరిపైనా పోలీసులు లాఠీచార్జి చేయలేదు. కార్యక్రమం మొత్తం మీద ప్రశాంతంగానే సాగింది. నిజంగానే ప్రభుత్వం గట్టిగా తలచుకునుంటే ఛలో విజయవాడ ప్రోగ్రామ్ ఇంత విజయవంతమయ్యేది కాదు. ఇన్ని రోజులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేరుగా జగన్నే శాపనార్ధాలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని దింపేస్తామని చాలెంజులు చేస్తున్నా ఎవరిపైనా ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఎవరిపైనా యాక్షన్ తీసుకోలేదు.



ఇపుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనంతా తాము ఆశించిన స్ధాయిలో జీతాలు పెరగలేదనే. ప్రభుత్వం పరిస్ధితిని వివరించినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టించుకోకుండా రోడ్డెక్కటం, 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళుతుండటం వాళ్ళ విజ్ఞత. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళనలు, సమ్మె విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇంత ఉదారంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రవాదులా ? సమ్మె చేసే హక్కు లేదా అంటు మొసలి కన్నీరు కారుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: