టెన్షన్ పడుతున్న యోగి.. సొంత పార్టీలోనే క్రాస్ ఓటింగ్..!

MOHAN BABU
మొదట మధుర అన్నారు. కాదు కాదు అయోధ్య అయితే బెటర్ అన్నారు. ప్రయాగ్రాజ్ మరి సేఫ్ అన్నారు. మరి ఉన్నట్టుండి యోగి ఆదిత్యనాథ్ సొంత ఇంటినే ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది. అక్కడున్న ఒక సెంటిమెంట్ యోగి లో టెన్షన్ పుట్టిస్తుందన్నది నిజమేనా..? ప్రత్యర్థి పార్టీల గట్టి పోటీ అటుంచితే సొంత పార్టీలోనే క్రాస్ ఓటింగ్ పై యోగికి దిగులు పట్టుకుందా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి పోటీ చేయబోయే అసెంబ్లీ నియోజకవర్గం ఎట్టకేలకు డిసైడ్ అయ్యింది. మధుర, అయోధ్య అంటూ మొన్నటి వరకు సాగిన ప్రచారానికి తెర పడింది.

 అయితే ఇదే గోరఖ్ పూర్ స్థానం నుంచి 1971లో సీఎంగానే పోటీచేసిన త్రిభువన్ నారాయణ్ సింగ్ ఓడిపోవడం యోగికి ఎక్కడో టెన్షన్ పుట్టిస్తోందని విపక్షాలు అప్పుడే టెన్షన్ రాజేయడం మొదలు పెట్టాయి. గోరఖ్ పూర్ యోగి ఆదిత్యనాథ్ హోమ్ టౌన్. ఆర్ఎస్ఎస్ ప్రచారంగా, గోరఖ్ పూర్ కేంద్రంగా ఆయన ఎదిగారు. 1998 నుంచి 2017 లో ముఖ్యమంత్రి అయ్యేవరకు గోరఖ్ పూర్ ఎంపీగా తిరుగులేని విజయాలను సాధించారు. అయితే 2017 లో సీఎం అయ్యుండి కూడా సొంత స్థానాన్ని కాపాడుకోలేక పోయారు యోగి. ఇప్పుడు మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి పోటీ చేయడంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సెటైర్లు పేల్చారు. మధుర, అయోధ్య,ప్రయాగరాజ్ నుంచి పోటీ చేస్తారని మొన్నటివరకు ప్రచారం జరిగిందని అయితే యోగిని ఇంటికి పంపినందుకు తాను హ్యాపీ అంటూ వ్యంగ్యాలు విసిరారు. అఖిలేష్ సెటైర్లు పేల్చిన యోగిని మధుర నుంచి పోటీ చేయించాలని గతంలో బిజెపి రాజ్యసభ ఎంపీ హన్నార్ సింగ్ యాదవ్ ఏకంగా బీజేపీ హైకమాండ్ కు లేఖ రాశారు. యోగి అయితే అయోధ్య అడిగారని పార్టీలో చర్చ జరిగింది. అయితే అక్కడ స్వామిజీలు మాత్రం యోగిని పోటీకి పెడితే ఓడించి పంపిస్తామని ఆర్ఎస్ఎస్ నేతలకు చెప్పారట. దీంతో సొంత నియోజకవర్గమైన గోరఖ్ పూర్ అయితేనే సేఫ్ సీట్ అని యోగి భావించారని టాక్.

మరోవైపు యోగిని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు గోరఖ్ పూర్ లో గట్టి అభ్యర్థులను నిలిపేందుకు పట్టుదలగా ఉన్నారు ప్రత్యర్థులు. మొన్నీమధ్య సమాజ్ వాదీ లో చేరిన బిజెపి లీడర్ శుభావతి శుక్లాను ఎస్పీ రంగంలోకి దింపే అవకాశం ఉంది. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ గోరఖ్ పూర్ నుంచి పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ కూడా సీరియస్ క్యాండెట్ ని ఆలోచిస్తోందట. సొంతపార్టీ నేతలే క్రాస్ ఓటింగ్ తో యోగిని ఓడిస్తారని విపక్ష నేతలు మాట్లాడుతున్నారు. మొత్తానికి రకరకాల పరిణామాల నేపథ్యంలో సొంత పట్టణం నుంచి తొలిసారి బరిలోకి దిగుతున్న యోగికి విజయంపై నమ్మకం ఉన్నా ఏదో మూలన కీడు శంకిస్తున్నట్టుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: