టెస్లా వ్యాపారం.. పార్టీల రాజ‌కీయం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ కంపెనీ టెస్లా భార‌త్‌లో వ్యాపారం చేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు రాజ‌కీయ రూపు తీసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌లే ఒక నెటిజెన్ భార‌త్‌లో మీ కార్ల ప్ర‌వేశం ఎప్పుడంటూ అడిగిన ప్ర‌శ్న‌కు బదులుగా టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ భార‌త్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలే తమ కంపెనీ ఉత్ప‌త్తులు ఇండియ‌న్ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు అడ్డంకిగా ఉన్నాయ‌ని వ్యాఖ్య‌నించిన విష‌యం తెలిసిందే. అత‌డి వ్యాఖ్య‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం కూడా ఘాటుగానే స‌మాధాన‌మిచ్చింది. అత‌డి వ్యాపార వ్యూహాల‌ను వెల్ల‌డి చేస్తూ భార‌త మార్కెట్ ను వినియోగించుకోవాల‌నుకుంటే ఇక్క‌డ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు పెట్టాల్సిందేనంటూ మ‌స్క్‌కు బ‌దులిచ్చింది. ఇక టెస్లా యాజ‌మాన్యంపై కేంద్రం వైఖ‌రి ఎలా ఉన్నా ఇప్పుడు రాష్ట్రాలు మాత్రం ఆ కంపెనీ ఇండియాలో పెట్టుబ‌డులు పెడితే అవి త‌మ రాష్ట్రానికే ర‌ప్పించుకునేందుకు పోటీ ప‌డుతున్నాయి. విచిత్ర‌మేమిటంటే ఈ పోటీకి దిగిన రాష్ట్రాల‌న్నింటిలోనూ బీజేపీయేత‌ర పార్టీలే ఉండ‌టం.

 
రెండు రోజుల క్రిత‌మే తెలంగాణ ప్ర‌భుత్వంలో మంత్రి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ టెస్లా వ‌స్తే తెలంగాణ రాష్ట్రం ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం యూఎస్‌లో తాను టెస్లా కార్ ను న‌డిపిన ఫోటోల‌ను కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు కూడా. త‌మ ప్ర‌భుత్వం ఈవీల త‌యారీ కంపెనీల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని ఇప్ప‌టికే తెలంగాణ‌లో ట్రిటాన్ రూ. 2,100 కోట్ల‌తో త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌బోతోంద‌ని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఈ పోటీలోకి పంజాబ్ ప్ర‌భుత్వం కూడా దిగింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ టెస్లా కంపెనీని పంజాబ్‌లోని లూథియానాలో పెట్టాలంటూ ఆహ్వానించారు. పంజాబ్‌ను ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ కేంద్రంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, ఉద్యోగాలు క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌ల‌కు తాము ప్రోత్సాహ‌కాలు అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. మ‌రోప‌క్క బెంగాల్ కూడా ఈ రేసులో తామూ ఉన్నామ‌ని చాటుకోవ‌డం మ‌రో విశేషం. ఆ రాష్ట్ర మంత్రి మ‌హ‌మ్మ‌ద్ గులామ్ ర‌బ్బానీ మ‌స్క్ త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే అన్నిర‌కాలుగానూ స‌హ‌క‌రిస్తామ‌ని పేర్కొన్నారు. ఒకప్పుడు టాటా కార్ల కంపెనీకి వ్య‌తిరేకంగా మ‌మ‌త చేసిన‌ పోరాటం గుర్తుకు తెచ్చుకుంటే ఇది ఆశ్చ‌ర్య‌మే మ‌రి. మ‌రోప‌క్క‌ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూడా టెస్లా కు రెడ్ కార్పెట్ ప‌ర‌చేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు వెల్ల‌డించింది. ఈ రాష్ట్రాల‌న్నీ బీజేపీ వ్య‌తిరేక ప‌క్షాలే అధికారంలో ఉండ‌టం చూస్తే మ‌స్క్ ఒక్క ట్వీట్‌తో రాజ‌కీయంగానూ వేడి పుట్టించార‌నే చెప్పాలి మ‌రి. విదేశీ పెట్టుబ‌డుల‌కు అనుమ‌తించాల్సింది కేంద్ర‌మే. ఈ రాష్ట్రాలు ఇస్తామంటున్న ప్రోత్సాహ‌కాలు న‌చ్చి మ‌స్క్ ఇండియాకు వ‌స్తారా.. కేంద్రం సానుకూలంగానే ఉంటుందా అనే అంశాలు చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: