హైదరాబాద్ వాసులకు నెరవేరనున్న బుల్లెట్ రైలు కల...!

Podili Ravindranath
భారతీయ రైల్వే ఇప్పుడు అత్యాధునిక సేవలు అందించే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే వేగం, సౌకర్యాల కల్పనలో భారతీయ రైల్వే అభివృద్ధి చెందిన దేశాలతో పరుగులు పెడుతోంది. ప్రధానంగా దేశంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత... రైల్వే రంగంపై ప్రత్యక దృష్టి సారించింది. దేశంలోని అన్ని రైల్వే మార్గాలను కూడ డబుల్ ట్రాకులుగా మార్చేస్తున్నారు. అలాగే వేగం కోసం విద్యుదీకరణ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది రైల్వే శాఖ. అలాగే తేజాస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో అత్యాధునిక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోనే అత్యధికంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంది. ఇక ఇదే సమయంలో బుల్లెట్ రైళ్లను కూడా నడిపేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు బుల్లెట్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది.
గతంలో భారతీయ రైళ్లపై ఎన్నో జోకులు ఉన్నాయి. నువ్వు రావాల్సిన రైలు జీవిత కాలం లేటు అని కొందరంటే... ఇప్పుడు వస్తున్న రైలు... నిన్న ఈ సమయానికి రావాల్సింది అని మరికొందరు వ్యగ్యాస్త్రాలు వేసే వారు. ఇక పారిశుధ్యంపై అయితే.. చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఎన్నో మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. నేషనల్ రైల్ ప్లాన్‌లో భాగంగా భారతీయ రైల్వే శాఖ బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పరిధిలోకి మరో నాలుగు కొత్త కారిడార్లను తీసుకువచ్చింది. వీటి ద్వారా దేశంలో మొత్తం 9 పట్టణాలను బుల్లెట్ రైలు కలపనుంది. ఈ ప్రాజెక్టులో హైదరాబాద్ నగరానికి చోటు దక్కింది. హైదరాబాద్ నుంచి రెండు రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 618 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను నిర్మించనుంది భారతీయ రైల్వే. అంతకు ముంబై-హైదరాబాద్ మధ్య 711 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ముందే మంజూరు చేసింది ఇండియన్ రైల్వే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: