ఫ్యాన్ పార్టీలో ర‌చ్చ‌.. సిక్కోలు టు చిత్తూరు వ‌ర‌కు అదే సీన్‌...!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో రచ్చ మామూలుగా లేదు అని చెప్పాలి. ఎక్కడెక్కడ సొంత పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలపై తిరుగుబాటు మొదలు పెట్టేశారు. అసలు ప్రతిపక్ష టీడీపీకి అవకాశం ఇవ్వకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలు రోడ్డు ఎక్కారు.

2024 ఎన్నికల్లో టెక్క‌లిలో వైసీపీ జెండా ఎగరాలి అంటే అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి మరో నేతకు ఇన్చార్జి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు జడ్పీ చైర్మన్ మ‌జ్జి శ్రీనివాస రావు జోక్యం అన్ని నియోజకవర్గాల్లోనూ ఎక్కువగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సామాజికవర్గం ఎమ్మెల్యేలు బాగా పెత్తనం చెలాయిస్తూ ఉండడంతో మరో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నేత‌లు ర‌లిగిపోతున్నారు.

రాజోలు - అమలాపురం - పి గన్నవరం లాంటి చోట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ను కూడా సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు సుచరిత - శ్రీదేవి - రజిని ముగ్గురికి కూడా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు సీటు ఇస్తే... వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని అక్కడ నేతలు శప‌థాలు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కి వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన జెడ్పిటిసి భర్త తీవ్రమైన విమర్శలు చేశారు. ఇలా ఆరోపణలు చేసిన వెంటనే ఆయనను పాత కేసులో అరెస్టు చేయించారు. కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం - అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల్లోనే తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పై సొంత క్యాడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: