అనంత టీడీపీలో ఆ ఇద్ద‌రు అవుట్ డేటెడ్ నేత‌లేనా..?

VUYYURU SUBHASH
ఏపీ టీడీపీలో చాలామంది అవుట్ డేటెడ్ నేతలు పార్టీలో తెల్లఏనుగుల‌ మాదిరిగా మారిపోయారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వస్తున్న ఈ నేతల్లో కొందరు ఇప్పటికీ ప్రజల్లో అదే క్రేజ్.. అదే దూకుడుతో ఉన్నారు. ఉదాహరణకు నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు - రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలకు ఇప్పటికీ ప్రజల ఆదరణ అలాగే ఉంది. వారు పార్టీ కోసం ఎంత‌కైనా పోరాడ‌తారు. అలాంటి నేతలతో ఇబ్బంది లేదు. కొందరు నేతలు మాత్రం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి... పార్టీ ప్రతిపక్షంలో కి వచ్చాక ఇంట్లో దూరి బయటికి రావడం లేదు.

పార్టీకి పెద్ద భారంగా మారిన ఇలాంటి నేతలు ఇప్పుడు అధికార వైసీపీకి, ఖ‌ర్చుకి భయపడి... సొంత పార్టీ కేడర్‌ను పట్టించుకోవడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కావాలి... ఆ తర్వాత మంత్రి పదవి కావాలని గొంతెమ్మ కోరిక‌లు కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప - మాజీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా జిల్లాలో పార్టీకి పెనుభారంగా మారార‌న్న విమర్శలు సొంత పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

హిందూపురం ఎంపీ గా రెండుసార్లు గెలిచిన నిమ్మల కిష్టప్ప గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయాక అసలు ప్రజల్లోకి రావడమే మానేశారు. గతంలో గోరంట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కిష్టప్ప వచ్చే ఎన్నికల్లో తనకు పుట్టపర్తి టిక్కెట్ కావాలంటూ స్థానికంగా ఒకరిద్దరు వార్డు మెంబర్ స్థాయి నేతలను వెంటేసుకొని హడావుడి చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ గాలిలో గెలవడమే తప్ప నిమ్మల కిష్టప్ప ఒక వార్డ్ మెంబర్ స్థాయి వ్యక్తి అని... ఆయన కాలం చెల్లిన రాజకీయాలతో పార్టీకి భారంగా మారడం తప్ప ఉపయోగం లేదని అనంతపురం జిల్లా టిడిపి కేడర్ చర్చించుకుంటోంది. పుట్టపర్తిలో ఎప్పటికి పల్లె రఘునాథరెడ్డి వల్లే పార్టీ నిలబడుతుందని అక్కడ కొందరు పార్టీ నేతలను ఎగదోసి కిష్టప్ప పార్టీలో గ్రూపులను పెంచి ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
పెనుగొండ‌లో పార్థ‌సార‌థికి ఇక విశ్రాంతే...!
ఇక పెనుగొండలో ఇప్పటికే టీడీపీని ముంచేసిన మరో సీనియర్ నేత బి.కె పార్థసారథిని వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగిస్తే... టీడీపీ కంచుకోట అయిన పెనుగొండ సీటును మరోసారి బంగారు పళ్లెంలో పెట్టి వైసీపీకి అప్పగించినట్టు అవుతుందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్థసారథి జనాల్లోకి రావడం లేదు. ఇటు కేడర్‌ను కలుపుకు పోవడం లేదు. పైగా పార్టీ కోసం కష్టపడే వారిని అణ‌గ‌దొక్కే చర్యలు చేస్తూ ఉండడంతో స్థానికంగా ఆయనపై టిడిపి వాళ్లలోనే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.

పార్టీ నేతల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా ఆయన సాయం చేయ‌డం లేదంటున్నారు. ఆయనంటే ఆగ్రహంతో రగులుతున్న పెనుగొండ జనాలు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో టిడిపిని చిత్తుగా ఓడించార‌ని పార్టీ అధిష్టానానికి సైతం నివేదికలు అందాయి. చంద్రబాబు సైతం పార్థసారథి - నిమ్మల కిష్టప్పలను వచ్చే ఎన్నికల్లో కంటిన్యూ చేసేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. పెనుగొండ లాంటి చోట కొత్త నేతలకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా బి.కె పార్థసారథి, నిమ్మల కిష్టప్ప రాజకీయం దాదాపుగా ముగిసిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: