టీఆర్ఎస్ : తెలంగాణ భ‌వ‌న్‌లో కీల‌క భేటీ.. ఎందుకో తెలుసా..?

N ANJANEYULU
తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ కీల‌క భేటీ అయ్యారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, కార్పొరేష‌న్ చైర్మ‌న్లు కూడా  ఇవాళ జ‌రిగిన  స‌మావేశంలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా ధాన్య‌కొనుగోళ్లు, బొగ్గుగ‌నుల వేలంపై ప్ర‌భుత్వం అనుస‌రించాల్సిన విధానంపై టీఆర్ఎస్ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది.
అదేవిధంగా కేంద్ర‌ప్ర‌భుత్వంపై పోరులో భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ ఓ స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న తీవ్ర అన్యాయం పై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహరచన చేస్తున్న‌ట్టు స‌మాచారం. ధాన్యం కొనుగోళ్లపై మోడీ ప్ర‌భుత్వం తీరుకు నిరసనగా ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆందోళనలు చేసిన విష‌యం విధిత‌మే. ఇక సింగ‌రేణి బొగ్గుగ‌నుల ప్ర‌యివేటీక‌ర‌ణ అంశం.. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్రంలో బీజేపీ తీరుపై మ‌రింత ఉదృతంగా ఉద్య‌మించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.  గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వ‌ర‌కు పార్టీ శ్రేణులంద‌రినీ భాగ‌స్వామ్యం చేసేందుకు టీఆర్ఎస్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది.
మ‌రోవైపు  ఇవాళ జ‌రిగిన భేటీలో ద‌ళిత బంధుపై సీఎం కేసీఆర్ ఇవాళ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. ముఖ్యంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని క‌చ్చితంగా అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టంచేసారు కేసీఆర్‌. హుజూరాబాద్ ఉప ఎన్నిక త‌రువాత ద‌ళిత బంధు అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు చేస్తున్న త‌రుణంలో.. కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసారు. అదేవిధంగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారికి ప‌ద‌వులు ఇస్తామ‌ని నేత‌ల‌కు సూచ‌న‌లు చేసారు. టీఆర్ఎస్ విస్తృత‌స్థాయి స‌మావేశంలో నేత‌ల‌కు ఇవాళ కేసీఆర్ కీల‌క సూచ‌ల‌ను చేశారు.  ముఖ్యంగా వ‌రిసేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర‌మును నిల‌దీయాల‌ని, రైతుల‌కు అర్థం అయ్యేలా వివ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి. ఎమ్మెల్యేలు జనాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేసారు. అదేవిధంగా  జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరని ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు కేసీఆర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: