కృష్ణాలో ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు డ్యామేజ్?

M N Amaleswara rao
ఏపీలో అధికార వైసీపీ బలం కొంచెం కొంచెం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మారుతున్న రాజకీయాలు కావొచ్చు...వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కావొచ్చు...టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపడం కావొచ్చు...కొన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్‌కు రివర్స్ గాలి వీస్తుంది. ఏపీలో పలు నియోజకవర్గాల్లో సైకిల్‌కు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. కాకపోతే పూర్తి స్థాయిలో టీడీపీ బలం మాత్రం పుంజుకోలేదు. కానీ నియోజకవర్గాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ నిలబడుతుంది.
అలా కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ చాలా వరకు పికప్ అయినట్లే కనిపిస్తోంది. వరుసగా మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. మామూలుగా ఈ మూడు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలే. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఈ మూడు చోట్ల టీడీపీ గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో మూడు చోట్ల టీడీపీ ఓటమి పాలైంది.
టీడీపీపై తీవ్ర వ్యతిరేకత...జగన్ గాలి ప్రభావంలో మూడు చోట్ల వైసీపీ గెలిచేసింది. కానీ ఈ రెండున్నర ఏళ్లలో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. మూడు చోట్ల ఫ్యాన్‌కు రివర్స్ గాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మైలవరం పరిధిలో ఉన్న కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. అలాగే జగ్గయ్యపేట మున్సిపాలిటీలో దాదాపు టీడీపీ గెలిచినంత పనిచేసింది...వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది. అంతకముందు నందిగామ మున్సిపాలిటీలో సైతం వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది.
అలాగే మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు అంతగా సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా ఈ మూడు నియోజకవర్గాలు రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటాయి. ఈ రాజధాని ప్రభావం కూడా వైసీపీపై ఉంది. ఇక ఈ మూడు చోట్ల టీడీపీ నేతలు త్వరగా పుంజుకున్నారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే ఈ మూడు నియోజకవర్గాల్లో ఫ్యాన్‌కు గట్టిగానే డ్యామేజ్ జరిగేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: