జూ. ఎన్టీఆర్‌పై దాడి.. పక్కా ప్లాన్‌ ప్రకారమేనా..?

Chakravarthi Kalyan
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రత్యేకించి సీనియర్‌ నేత వర్ల రామయ్య చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి.  నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యల్ని ఖండించడంలో మేనల్లుడిగా జూనియర్ ఫెయిల్ అయ్యారని వర్ల రామయ్య ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. జూనియర్‌కు సన్నిహితులుగా చెప్పుకొనే వంశీ, కొడాలినానీ.. హద్దులు మీరి విమర్శిస్తుంటే స్పందించాల్సింది ఇలాగేనా అంటూ వర్ల కామెంట్ చేశారు.  సినిమాలు అందరికి ఉంటాయని, కానీ స్పందించాల్సిన చోట నాన్చుడు సరికాదని వర్ల రామయ్య అన్నారు.

వర్ల ఒక్కడే మాట్లాడటం కాదు.. ఇది పార్టీ స్టాండ్ అన్నట్టుగా కొందరు ఇతర నాయకులు కూడా వర్లతో గొంతు కలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై వర్ల రామయ్య వ్యాఖ్యల్ని బుద్దా వెంకన్న కూడా సమర్థించారు. జూనియర్‌పై మా మనసులో ఉన్నదే వర్ల రామయ్య బయటపెట్టారని కామెంట్ చేశారు. ఊరికే.. మావయ్య, అత్త అనుకోవడం కాదు.. కష్టమొస్తే బయటికొచ్చి మాట్లాడాలని బుద్దా అన్నారు. జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు సైతం.. ఏంటీ ఎన్టీఆర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని బుద్దా అన్నారు. నారా భువనేశ్వరికి మేనల్లుడిగా జూనియర్ ఫెయిల్ అయ్యారని మొహమాటం లేకుండా చెప్పారు.

పైకి చూస్తే ఇదేదో యథాలాపంగా జరిగిన మాటల దాడిగా కనిపిస్తున్నా.. లోతుగా ఆలోచిస్తే..దీని వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. వర్ల, బుద్దా వంటి వారు.. జూనియర్ ఎన్టీఆర్‌పై పార్టీ అధిష్టానంతో సంప్రదించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశమే లేదు. అలాంటి క్రమశిక్షణ ఉన్న పార్టీ తెలుగు దేశం.. ఇప్పటికే నారా లోకేశ్‌ తో పార్టీ ముందుకు పోవడం కష్టం అన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎప్పటికైనా ఇబ్బందే అని చంద్రబాబు ఫీలవుతున్నారమో అన్న వాదన కూడా వినిపిస్తోంది. జూనియర్‌ పై టీడీపీ వ్యతిరేకి అని కానీ లేదా.. టీడీపీకి సహకరించని వ్యక్తిగా ముద్ర వేస్తే.. అది ఎప్పటికైనా పనికొస్తుందని చంద్రబాబు భావిస్తుండొచ్చు. అందుకే ఏమాత్రం అవకాశం దొరికినా జూనియర్ ఎన్టీఆర్‌పై ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: