నెరవేరిన ప్రకాశం వాసుల చిరకాల వాంఛ...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ఏది అంటే... అంతా ఠక్కున చెప్పే సమాధానం ప్రకాశం జిల్లా. పేరుకే రాష్ట్రం మధ్యలో ఉన్నప్పటికీ.... అరకొర వసతులకో అల్లాడుతోంది. సరైనా తాగు నీటి సదుపాయం లేకపోవడం, వైద్య సదుపాయం అందుబాటులో లేదు. చివరికి ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ బాధలు తీరనున్నాయి. ప్రకాశం జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ చట్టం 1991కు సవరణ చేస్తూ 2021 సవరణ బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గురువారం శాసనమండలి లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఇప్పటికే శాసనసభ ఆమోదించగా గురువారం శాసనమండలి ఆమోదించింది. గత ప్రభుత్వం విశ్వావిద్యాలయం ఏర్పాటుకు కేవలం ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. కనీసం వీసీ పోస్ట్ కూడా మంజూరు చేయకుండా యూనివర్సిటీ ఏర్పాటు అని ప్రకటించిన ఘనత గత ప్రభుత్వానిదన్నారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ ప్రాధాన్యతను గుర్తించామన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామంలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదించడం జరిగింది. ఇప్పటికే స్థల సేకరణ కూడా పూర్తైందన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని యూనివర్సిటీలకు భిన్నంగా ఇక్కడ ఉపాధ్యాయ విద్య ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న ఉపాధ్యాయ విద్యను ఉన్నత విద్యాసంస్థలోకి చేర్చటంపై అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఒక శిక్షణా కేంద్రాన్ని స్థాపించి అధ్యాపక విద్య నాణ్యతను పటిష్టపరచడం ద్వారా నాణ్యమైన అధ్యాపకులను తయారు చేయాలి అనేది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. బిల్లు ఆమోదం ద్వారా యూనివర్సిటీ ఏర్పాటులో తదుపరి చర్యలు వేగవంతంగా జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటుపై పలువురు మండలి సభ్యులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను అభినందించి మద్దతు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: