టీడీపీలో కాపు నేత‌ల అడ్ర‌స్ ఎక్క‌డ‌...!

VUYYURU SUBHASH
ఏపీలో రాజకీయ రగడ రచ్చరచ్చగా జరుగుతోంది. చంద్రబాబు అసెంబ్లీలో జరిగిన ఘటనపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయ‌న ఓ ఘాటు లేఖ రాశారు. గతంలో తన కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన విషయం బాబుకు గుర్తులేదా ? నాడు మా కుటుంబానికి జరిగిన అవమానం మీకు కనిపించలేదా ? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు ముసలి కన్నీరు కార్చడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ముద్రగడ తన లేఖలో విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి అయితే  పెద్ద‌గా స్పంద‌న లేదు. ఇక టిడిపి కాపు నేతలు ఎవరూ కూడా కౌంటర్ ఇవ్వలేదు. ఒక్క‌ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప త‌ప్పా టిడిపి నుంచి ఎవరు స్పందించక పోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టిడిపిలో బలమైన కాపు నేతలు చాలా మంది ఉన్నారు. టీడీపీ కాపు కీల‌క నేత‌ల్లో వంగవీటి రాధా -  బొండా ఉమామహేశ్వరరావు - నిమ్మల రామానాయుడు - జ్యోతుల నెహ్రూ - గంటా శ్రీనివాసరావు - నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్ద‌దే.
వీరిలో చాలా మంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది పదవులను దక్కించుకున్నారు. కానీ చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాసినా వారి నుంచి స్పంద‌న లేక పోవడంతో టీడీపీలో ని ఇత‌ర సామాజిక వ‌ర్గాల నేత‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. రాధాకు తండ్రి వారసత్వంగా ఇచ్చిన బలమైన కాపు సామాజికవర్గం అండగా ఉంది.. అయినా కూడా ఆయ‌న ముద్రగడ విషయంలో నోరు మెదపలేదు. వంగవీటి రాధా మౌనంగా ఉండటానికి కారణాలేంటన్న ప్రశ్నలు కూడా వ‌స్తున్నాయి.
ఇక రామానాయుడు కూడా ఎందుకు స్పందించ‌డం లేదు ? అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు. బొండా ఉమా కూడా అసంతృప్తితో ఉండ‌డం వ‌ల్లే మాట్లాడ‌డం లేద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: