కృష్ణా వైసీపీ బ్ర‌దర్స్ ఆశ‌లు గ‌ల్లంతేనా ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రస్తుత జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు సైతం లీకులు ఇస్తున్నారు. అయితే జగన్ ముందు చెప్పినట్టు 90% మంత్రులను మారుస్తారా ? లేదా నూటికి నూరు శాతం మంత్రులను మారుస్తారా ? అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే జగన్ క్యాబినెట్ లో ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని ముందు నుంచి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
వీరిలో జోగి రమేష్ బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయ‌న పెడన నుంచి రెండో సారి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇక మాజీ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరికి సామాజిక సమీకరణల నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరికీ షాక్ లు తప్పవని అంటున్నారు. జోగి రమేష్ తన నియోజకవర్గ కేంద్రమైన పెడన జడ్పిటిసి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిపించుకోలేక పోయాడు.
ఇక పార్థసారథి మంత్రి పదవి ఆశిస్తున్నా ఆ పదవిని విశాఖపట్నం జిల్లాకు చెందిన కొత్త ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు ఇస్తారంటూ తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గం కోటాలో వంశీకృష్ణ మంత్రి అయితే పార్థసారథి దారులు మూసుకు పోయినట్లే అవుతుంది. విశాఖపట్నం జిల్లాల్లో బలంగా యాదవులు విస్తరించి ఉన్నారు. వీరు ఎప్ప‌టి నుంచో టీడీపీ కి ఫుల్ గా స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు.
ఆ సామాజిక వర్గం వారిని పూర్తిగా టిడిపికి దూరం చేసి... తనవైపుకు తిప్పుకునే క్రమంలో జగన్ వంశి కి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే కృష్ణా వైసిపి బ్రదర్స్ అశ‌లు గ‌ల్లంతు అయిన‌ట్టే అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: