జేసీ - పరిటాల కలియిక... అభిమానుల మదిలో పులకింత..!

Podili Ravindranath
ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. అక్కడ ఒకసారి మొదలైనా గొడవ... అంత సామాన్యంగా తగ్గదు కూడా. ఇంకా చెప్పాలంటే... హత్యా రాజకీయాలకు పుట్టినిల్లుగా ఉండే రాయలసీమ ప్రాంతంలో బద్ధ విరోధులు మిత్రులుగా మారడం అసలు జరగని పని. ఒకే పార్టీలో ఉంటున్న నేతలైనా సరే... ఎదురు పడితే చాలు... పలకరింపు మాట దేవుడెరుగు... నువ్వెంత అంటే నువ్వెంత అనేలా కత్తులు దూసుకుంటారు. నీతో నాకేం పనిలేదు అంటారు. సయోధ్యకు పార్టీ అధినేతలు స్వయంగా రంగంలోకి దిగినా కూడా ససేమిరా అనేస్తారు తప్ప... సయోధ్యకు మాత్రం రారు. అలాంటిది అనంతపురం జిల్లాలో ఈ రోజు జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎస్ఎస్‌బీఎన్ కళాశాల విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌పై నిరసన వ్యక్తం చేసేందుకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపుంలో పర్యటించారు. జిల్లాకు వస్తున్న లోకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా నేతలంతా జిల్లా సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడే ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. లోకేశ్ కోసం మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తమ అనుచరులతో లోకేశ్ రాక కోసం ఎదురు చూశారు.
ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పరిటాల రవి హత్యలో జేసీ సోదరులకు కూడ హస్తం ఉందనే అనుమానం ఉంది. సీబీఐ దర్యాప్తులో జేసీ దివాకర్ రెడ్డిని కూడా విచారించారు. 2009లో శాసనసభకు ఎన్నికైన పరిటాల సునీత కూడా ప్రొటెం స్పీకర్‌గా జేసీ దివాకర్ రెడ్డి ఉంటే.. తాను ప్రమాణం చేసేది లేదని తేల్చి చెప్పారు. ఇక 2014లో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఈ రెండు కుటుంబాల నేతలు కనీసం పలకరించుకోలేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా జిల్లాలో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే రాష్ట్రం సమస్యల్లో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.  కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ఇద్దరు నేతలు కలవడంతో రెండు వర్గాల నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఈ రెండు కుటుంబాలు కలిసి పనిచేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: