1500 మంది నేత్ర దానానికి రెడీ.. అంతా పునీత్ స్ఫూర్తితోనే..!

NAGARJUNA NAKKA
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం విషాదం నుంచి అభిమానులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. చనిపోయాక నలుగురికి చూపు ప్రసాదించిన పునీత్ రాజ్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది నేత్రదానానికి ముందుకొస్తున్నారు. నాలుగైదు రోజుల్లో 1500మంది తమ కళ్లను ఇస్తామని సంతకాలు చేశారనీ.. బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వ్యవస్థాపకులు డాక్టర్ భుజంగ శెట్టి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేత్రదాన ధోరణి క్రమంగా పెరుగుతోందని.. పునీత్ మరణించాక ఇది 20 నుండి 30శాతం పెరిగిందని మరో వైద్యురాలు చెప్పారు.
ఇక కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఒక రోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నటి ప్రణీత ప్రకటించింది. అప్పూ సర్.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవసరమైన వారందరికీ ఎన్నో రకాలుగా సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. వారి విద్య, వైద్య ఖర్చులను భరించారని తెలిపారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారన్న ప్రణీత.. అలాంటి గొప్ప వ్యక్తి అడుగు జాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.
పునీత్ రాజ్ కుమార్ 45 ఫ్రీ స్కూల్స్, 26అనాథాశ్రమాలు, 16వృద్ధాశ్రమాలు, 19గోశాలలు, 1800మంది విద్యార్థులకు చదువు, అఖరికి చనిపోయాక రెండు కళ్లను కూడా దానం చేసిన గొప్ప వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అయితే పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో వాటి నిర్వహణలో కొంత బాధ్యతను తాను నిర్వర్తిస్తానని విశాల్ ముందుకొచ్చారు.
ఇక పునీత్ రాజ్ కుమార్ కు బసవశ్రీ అవార్డు-2021అందజేయనున్నట్టు మురగ మఠ్ తెలిపింది. వచ్చే ఏడాది బసవ జయంతి రోజున ఈ అవార్డు పునీత్ కుటుంబానికి అందజేయనున్నారు. పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ అభిమానులతో మాత్రమే కాదు.. టాలీవుడ్ తోనూ మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా పునీత్ చివరి సినిమా జేమ్స్ ను తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. సినిమాలో పునీత్ కు సంబంధించిన ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్స్ లు చేయాల్సి ఉందట. కానీ వాటిని పక్కన పెట్టేయనున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: