హుజురాబాద్‌ పోలింగ్‌ ముందు కాంగ్రెస్‌ ట్విస్ట్‌!

N.Hari
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. దీంతో డబ్బుల పంపకాలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారంపై అధికార టీఆర్ఎస్‌, భారతీయ జనతా పార్టీల మధ్య పరస్పరం ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. రెండు పార్టీల వారు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌ ఓటుకు రూ.6 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏకంగా రూ.10 వేలు పంపిణీ చేస్తున్నట్లు వీడియోలు వచ్చాయి.
అయితే ఈ డబ్బుల పంపిణీ వీడియోలన్నీ ఫేక్‌ అని అటు టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీ వారు చేసిన డబ్బుల పంపిణీ వీడియోలు మాత్రం వాస్తవమని ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు. ఇలా హుజురాబాద్‌లో డబ్బుల పంపిణీపై తీవ్ర గందరగోళం నెలకొనడం, ఓటర్లు రోడ్డెక్కి మరీ ఆందోళనకు దిగడం వంటి పరిణామాలను గమనించిన కాంగ్రెస్‌ పార్టీ.. సరిగ్గా పోలింగ్‌కు ముందు ట్విస్ట్‌ ఇచ్చింది. హుజురాబాద్‌ బైపోల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సుశీల్‌చంద్రకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తెలిపారు.

హుజురాబాద్‌లో ఓటుకు నోటు వ్యవహారం శ్రుతి మించిందనీ, టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు పంపిణీ చేస్తున్న డబ్బుల కోసం ఓటర్లు రోడ్డెక్కుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఓటుకు రూ.6 వేల రూపాయల నుంచి రూ.10 వేలు వరకు డబ్బులిచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, బహిరంగగానే ఓట్ల కొనుగోలుకి తెరతీసి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం పాలయ్యేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు, వీడియోలతో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రవణ్‌ తెలిపారు.
కేవలం మూడు గంటల వ్యవధిలో లక్షన్నర మంది వరకు ఓటర్లకు రూ.90 కోట్లు పంపిణీ జరిగిందని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయనున్నారు. సీఈసీకి ఫిర్యాదు చేసేవారిలో దాసోజు శ్రవణ్‌తోపాటు పలువురు నేతలు ఉన్నారు. ఇదిలావుంటే, కేవలం హుజురాాద్‌ ఉపఎన్నిక ప్రచారంలోనే కాకుండా గెలుపు విషయంలోనూ వెనుక పడిన క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: