కేసీఆర్‌ Vs ఈటల: ఓటుకు నోటు ఇవ్వాల్సిందే!?

N.Hari
హుజురాబాద్‌ ఉపఎన్నికలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నమైన పరిస్థితులు హుజురాబాద్‌లో చోటుచేసుకుంటుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు పంచే డబ్బుల కోసం కొందరు ఓటర్లు ఆందోళనకు దిగుతుండటం కలకలం రేపుతోంది. ఓటుకు నోటు ఇవ్వాల్సిందే! అన్నట్లుగా ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్‌లో కొత్త ట్రెండ్‌ కనిపిస్తోందని, గతంలో పార్టీలు ఇస్తేనే డబ్బులు పుచ్చుకునే ఓటర్లు.. ఇప్పుడు ఓటుకు నోటు ఇవ్వాల్సిందే? అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని, అందుకు డబ్బుల కోసం వారు రోడ్డెక్కి ఆందోళన చేసిన ఘటనలే నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇలా ఓటర్లు డబ్బుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించింది మాత్రం రాజకీయ పార్టీలు, నాయకులేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసే కాలం పోయి.. ఓటుకు నోటు కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించడానికి కారణం.. రాజకీయ పార్టీలు, నాయకుల నిర్వాకమే! ఎన్నికలు వచ్చిందంటే చాలు.. రాజకీయ పార్టీలు, నాయకులు ప్రలోభాలకు గురిచేయడం జరుగుతూ వస్తోంది. దీంతో ఎన్నికలు అంటేనే.. డబ్బుల పంపకం ఉంటుందన్న భావన పెరిగిపోయింది. ఇలా ఓటుకు నోటు అనే మత్తు బాగా తలకెక్కింది. ఈ మైకంలో ఉన్న ఓటర్లు.. పార్టీలు పంచే డబ్బుల కోసం ఆందోళనకు దిగే పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని పార్టీలు ఓటుకు 6 వేల రూపాయలు, అంతకుమించి కూడా పంచుతున్నాయి. ఇందుకోసం ఓటర్ల లిస్ట్‌ తయారు చేసి మరీ ఓటర్లకు వారు డబ్బులు పంచుతున్నారు. అయితే ఆ జాబితాలో తమ పేర్లు ఉన్నప్పటికీ.. తమకు డబ్బులు ఇవ్వడం లేదని కొందరు ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. లిస్టులో తమ పేరు లేకుంటే.. తాము డబ్బులు అడిగేటోళ్లం కాదని అంటున్నారు. తమ పేర్లతో డబ్బులను నాయకులు కాజేస్తారు కాబట్టే.. తాము డబ్బులు రాబట్టుకునేందుకు ఇలా చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇలా డబ్బుల కోసం నియోజకవర్గంలోని కమలాపూర్‌, రంగాపూర్‌, కాట్రపల్లి, పెద్దపాపాయపల్లి తదితర గ్రామాల్లో ఓటర్లు  ఆందోళనకు దిగారు. ఏకంగా సర్పంచ్‌ ఇంటి ఎదుటే బైఠాయించారు.
మొత్తంమీద హుజురాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నికలో కొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది. ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది. వాళ్లకు డబ్బులిచ్చి.. తమకు ఎందుకు ఇవ్వరు? అని కొందరు ఓటర్లు రోడ్డెక్కి మరీ గళమెత్తడంతో.. ఇంతలా ఓటుకు నోటు మత్తు ప్రజలను ఆవహించిందా? అన్న ఆందోళన రాజకీయ తటస్థులు, ప్రజాస్వామ్య వాదుల్లో వ్యక్తమవుతోంది. ఈ పాపం ముమ్మాటికి రాజకీయ పార్టీలు, నాయకులదేనని దుమ్మెత్తిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: