జగన్ కోతలు : సంక్షేమమే సంక్షోభానికి అసలు కారణం

RATNA KISHORE

ఒక‌ప్పుడు మిగులు విద్యుత్తుతో ఉన్న రాష్ట్రం. ఇప్పుడు చీక‌ట్లు త‌ప్ప‌వు అని భ‌య‌ప‌డిపోతున్న రాష్ట్రం. పొరుగు రాష్ట్రం క‌న్నా ఎందులోనూ తీసిపోని రీతిలో ఆర్థిక వ‌నరులు ఉన్నా అవ‌న్నీ క‌రిగించుకుపోతున్నాయి. త‌రిగిపోతున్నాయి. హ‌రించుకుపోతున్నాయి. ఈ ద‌శ‌లో అవ‌స‌రానికి మించిన అధికార దాహం కార‌ణంగానే విద్యుత్ వంటి రంగాల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ వ‌స్తోంది. సొమ్ముల‌న్నీ సంక్షేమానికి కేటాయించి, ఇప్ప‌టికిప్పుడు బొగ్గు కొనుగోలు నిధులు తేవాలంటే ఎలా అని? అధికారులు ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలుస్తోంది.
విద్యుత్ కు సంబంధించి అధికారులు చేసిన పొర‌పాట్లు కొన్ని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వ‌స్తున్నాయి. జెన్ కో క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే బ‌య‌ట విద్యుత్ ల‌భ్యం అవుతుండ‌డంతోనే తాము సింగ‌రేణి నుంచి మూడు నెల‌ల పాటు ( మార్చి, ఏప్రిల్, మే) బొగ్గు కొనుగోలు చేయ‌కుండా ఉండ‌డంతో యూనిట్లు అన్ని పూర్తిగా మూల‌కు చేరుకున్నాయి. త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో విద్యుత్ అవ‌స‌ర‌త గ‌ణ‌నీయంగా పెరిగింది. కోవిడ్ టైంలో  విద్యుత్ వినియోగం త‌క్కువ‌గా ఉన్నా లాక్డౌన్ ఆంక్ష‌లు ఎత్తివేసిన కార‌ణంగా వినియోగం పెరుగుతూ వ‌చ్చింది. ఇంత‌టి వినియోగానికి స‌రిప‌డినంత విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల నుంచి రావ‌డం లేదు. దీంతో పాటు సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌కు చెల్లించాల్సిన మొత్తాల‌నూ రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించ‌లేదు.


దీంతో కృష్ణ ప‌ట్నం కానీ వీటీపీఎస్ కానీ కావాల్సినంత రీతిలో ప‌నితీరు మెరుగు ప‌ర్చుకోలేదు. బొగ్గు కొర‌తే ఇందుకు కార‌ణం అని అధికారులు సైతం ధ్రువీక‌రిస్తున్నారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా  తీవ్ర స్థాయిలో విద్యుత్ కొర‌త‌కు రాష్ట్రం చేప‌ట్టిన నిర్ణ‌యాలే ఓ  ప్ర‌ధాన భూమిక పోషించాయి. ఈ త‌రుణంలో స‌మ‌స్య‌ను ఒడ్డుకు తీసుకురావ‌డంలో అధికారులు కృషి చేస్తున్నారు. నిరంత‌రం సంక్షేమ జ‌పం వినిపించే ముఖ్య‌మంత్రి, ఆయ‌న మంత్రి వ‌ర్గ అనుచ‌రులు బొగ్గు గ‌నుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు వేల కోట్లలో ఉన్న‌ప్ప‌టికీ వాటిపై వ‌డ్డీ కూడా భారీగా పెరిగిపోతున్న‌ప్ప‌టికీ స్పందించ‌రు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: