లోకేశ్ ప్లాన్‌ అమలు చేస్తున్న జగన్.. టీడీపీ సంబరం..!?

Chakravarthi Kalyan
నారా లోకేశ్ ప్లాన్‌నే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారా.. లోకేశ్‌ ఎప్పుడో చెప్పిన విధానాన్ని ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ అమలు చేస్తున్నారా.. దాదాపు పదేళ్ల కిందటే నారా లోకేశ్ రూపొందించిన ప్లాన్‌ ను పదేళ్లు ఆలస్యంగా అమలు చేసుకుంటూ అది తమ గొప్ప అని జగన్ చెప్పుకుంటున్నారా.. అవునంటున్నారు టీడీపీ నాయకులు.. ఇప్పుడు జగన్ వారానికో సారి బటన్ నొక్కి జనం అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు కదా. దాన్నే నగదు బదిలీ అంటారు.
 
ఈ నగదు బదిలీ కొత్తదేమీ కాదోయ్.. దీన్ని మా లోకేశ్‌ ఎప్పుడో చెప్పాడు.. అంటూ టీడీపీ నాయకుల్లో యనమల వంటి వారు చెప్పుకుంటున్నారు. అయితే ఈ మాటలు వైసీపీ నాయకులు కోపం తెప్పిస్తున్నాయి. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ కింద కోట్ల మంది లబ్ధిదారులకు జగన్ నగదు జమ చేస్తున్నారంటున్న వైసీపీ నేతలు.. అవినీతి, వివక్షకు తావులేకుండా పథకాలు అమలు అవుతున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతే కాదు.. అసలు సిసలు నగదు బదిలీ అన్నది ఇప్పడే ఏపీలో అమలవుతోందని అంటున్నారు.

నగదు బదిలీ కొత్తది కాదంటున్న యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలను  తప్పుబడుతున్నారు వైసీపీ నేతలు.. 2004లో వరల్డ్‌ బ్యాంకు చెప్పిందని.. 2009లోనే లోకేశ్ దీన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టాడని యనమల చెబుతున్నారని.. మరి అలాగైతే.. 2014లో అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. నారా లోకేశ్‌  అంత గొప్ప ముందుచూపున్నవారైతే ఆరోజు డీబీటీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. అసలు దేశంలోనే అత్యున్నతంగా  నగదు బదిలీని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని చెబుతున్నారు.

టీడీపీ నేతలు ఇంకా ఎంత కాలం కట్టుకథలు చెప్పుకొని కాలం గడుపుతారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎంతకాలం అబద్ధాలను మీ ఫ్యాక్టరీలో వండివార్చి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అయినా గతంలో చంద్రబాబు హయాంలోనూ  కొంత వరకూ నగదు బదిలీ జరిగందన్న విషయాన్ని మాత్రం వైసీపీ నేతలు కావాలని మర్చిపోతున్నారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: