బీ అలర్ట్ : పథకాలు కాదు కావాల్సింది ప్రగతి

RATNA KISHORE
జ‌గ‌న్ న‌మ్ముకుని ఉన్న సంక్షేమం ఆయన కొంప ముంచ‌నుంది అని, అదేవిధంగా ఆయ‌న‌కు ఓట్లు రావు స‌రిక‌దా కొత్త స‌మ స్య‌లు తెచ్చి పెడ్తాయి అని అంటున్నారు విప‌క్ష స‌భ్యులు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వివిధ ప‌థ‌కాల‌కు డ‌బ్బులు అప్పులు రూపంలో తీసుకు రావ‌డ‌మే జ‌గ‌న్ త‌ప్పిదం అని తేల్చేశారు ఇంకొంద‌రు. ఆర్థిక వ్య‌వ‌స్థ అన్న‌ది ఏమీ బాగాలేని స్థితిలో ఈ ఏడాది అమ్మ ఒడి ఆపేయ‌నున్నారు అని తేలిపోయింది. అందుకు వంద సాకులు వెతుకుతున్నారు. ఇంకా మ‌రికొన్ని ప‌థ‌కాల‌కూ మంగ‌ళం పాడేయ‌నున్నారు.

ప‌థ‌కాలు పేరిట డ‌బ్బులు పంచుకుంటూ పోతున్న ఏపీ స‌ర్కారు కు ఇప్పుడు వ‌రుస సంక్షోభాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. విద్యుత్ సంక్షోభం కార‌ణంగా, మ‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్ప‌త్తి లేని కార‌ణంగా రేప‌టి నుంచి కొత్త స‌మస్య‌లు త‌లెత్త‌డం ఖాయం. ఇదే సంద‌ర్భంలో ఇంకొన్ని స‌వాళ్లూ ప్ర‌భుత్వానికి ఎదురుకానున్నాయి. బొగ్గు కొర‌త కార‌ణంగానే థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తి లేద‌న్న వాద‌న కూడా త‌ప్పే! కొర‌త‌కు ప్ర‌ధాన కార‌కులు ప్ర‌భుత్వ పెద్ద‌లే. స‌కాలంలో సింగ‌రేణి బొగ్గు గ‌నుల అప్పులు తీర్చ‌క‌పోవ‌డం, అదేవిధంగా విద్యుత్ విష‌య‌మై ప‌క్క రాష్ట్రం నుంచి రావాల్సిన బ‌కాయిలు ప‌ట్టుబ‌ట్ట‌క పోవ‌డం ఇవ‌న్నీ పెద్ద వివాదాల‌కే తావివ్వ‌నున్నాయి.


బొగ్గు కొర‌త‌తో జెఎన్కో ప్లాంట్ల‌లో విద్యుత్ ఉత్ప‌త్తి స‌గానికి స‌గం ప‌డిపోయింద‌న్న‌ది ఓ వాస్తవం. ఈ ప‌రిస్థితుల్లో అధిక రేటుకు తాము విద్యుత్ కొనుగోలు చేయాల్సి వ‌స్తోంద‌ని ఏపీ స‌ర్కారు చెప్పినా, ఇది కూడా ఆమోద‌యోగ్యం కాదు. మిగులు విద్యుత్ తో న‌డిచే రాష్ట్రంలో ఇటువంటి చీక‌ట్లు తీసుకు రావ‌డ‌మే త‌గ‌ని ప‌ని. ముందు చూపు లేకుండానే అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని కొన్ని మీడియాలు చెప్పినా అవేవీ కాద‌ని జ‌గ‌న్ త‌మ‌వారి ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని కూడా కొన్ని ఆరోప‌ణ‌లు క‌థ‌నాల రూపంలో వెల్ల‌డిలో ఉన్నాయి. ఇవ‌న్నీ ఒక‌వైపు ఉంటే, మ‌రోవైపు ప‌థ‌కాల అమలుపై ఉన్న శ్ర‌ద్ధ మిగ‌తా స‌మ‌స్య‌లపై ఉండ‌డం లేద‌న్న‌ది ఓ వాద‌న‌. అస్స‌లు అభివృద్ధి అనేదే లేకుండా కేవ‌లం డ‌బ్బులు పంపిణీతో రాష్ట్రాన్ని అధోగ‌తిన న‌డిపిస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. ఈ ద‌శ‌లో ప్ర‌గ‌తి ఎలా సాధ్యం?

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: