ప్రకాశం జిల్లాను పీడిస్తున్న విషజ్వరాలు!

N.Hari
ప్రకాశం జిల్లావ్యాప్తంగా రోజురోజుకు భారీగా టైఫాయిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడక్కడా మరణాలు కూడా సంభవించటంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు వందల సంఖ్యలో రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒంగోలు రిమ్స్‌లో 200 మందికిపైగా జ్వర బాధితులకు చికిత్స అందిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య లోపం, దోమల ఉధృతి కారణం గానే విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఓ వైపు కరోనా తీవ్రత కొనసాగుతుండగానే రోజురోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. జిల్లాలో ఎక్కడ చూసినా జ్వర బాధితులు కనిపిస్తునే ఉన్నారు. గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. జిల్లాలో టైపాయిడ్‌, డెంగ్యూ, వంటి విష జ్వరాల ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వందకు పైగానే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అధికారికంగా లెక్కల్లో చూపనప్పటికీ పలు ప్రాంతాల్లో డెంగ్యూ మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
జిల్లాలో నెల రోజులుగా ముసురు పట్టినట్లుగా వర్షాలు పడిన ప్రాంతాల్లోనే జ్వర బాధితులు ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఒంగోలు లోని రిమ్స్‌లో 200 మంది డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. చీరాల, పర్చూరు, అద్దంకి, చీమకుర్తి, కొండపి ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. రోజువారీ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు వైద్యం కోసం వస్తున్న వారిలో ఇంచుమించు సగం మంది జ్వర పీడితులే ఉంటుండగా వారిలో డెంగ్యూ, టైఫాయిడ్‌ సోకిన వారు అధికంగా ఉంటున్నారు. సీజనల్‌ వ్యాధుల బారిన పడిన వారు ప్రభుత్వ వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. అయితే అక్కడ కూడా సరైన వైద్యం అందడం లేదు. పలు ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ జ్వరం మాత్రలు తప్ప కనీస రక్త పరీక్షలు కూడా లేకపోవటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స పొందుతున్నరోగులకు యాంటీ బయాటిక్‌ మందులు ఇవ్వడం లేదు. దీనికి తోడు కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో జ్వరం వస్తే అది కరోనానా లేక సాధారణ జ్వరమా, డెంగ్యూనా అన్నది అర్థంకాక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఇక చికిత్సకోసం ప్రైవేటు వైద్యశాలకు వెళ్లిన వారికి సాధారణ రక్త పరీక్షలతోపాటు, కరోనా టెస్ట్‌లు, ప్లేట్‌లెట్స్‌ ఇతరత్రా పరీక్షలు చేస్తుండటంతో ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. దీంతో అత్యధిక శాతం మంది ఈ తరహా లక్షణాలు ఉన్న వారు దగ్గరలోని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులను ఆశ్రయించి మందులు వాడుతూ తీవ్రత అధికమైతే ఆస్పత్రులకు వెళ్తున్నారు. అలా వస్తున్న వారితోనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల విష జ్వరాల కేసులు భారీగా నమోదు అవుతున్నాయని, ఈ తీవ్రత మరో రెండు నెలలపాటు ఉంటుందని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: