టీడీపీలో ఇక జూనియర్ల రాజ్యమే...!

Podili Ravindranath
40 ఏళ్ల వయస్సున్న పార్టీ తెలుగుదేశం. 1982లో నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ... రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా... దేశ రాజకీయాల్లో కూడా పెను మార్పు తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్న పార్టీ కూడా తెలుగుదేశం మాత్రమే. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు కూడా ఎన్టీఆర్. ఎంతో మంది కాంగ్రెస్ కీలక నేతలు కూడా తెలుగుదేశం పార్టీ దెబ్బకు ఓటమిపాలయ్యారు. సగం మంది పైగా కొత్త వారు, యువకులను 1983 ఎన్నికల బరిలో నిలిపిన ఎన్టీఆర్... తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. నాటు ఎన్టీఆర్‌పై అభిమానం, వ్యవస్థలో మార్పు కోరుకున్న ఎంతో మంది యువత... రాజకీయాల్లో ప్రవేశించి... రాణించారు. అయితే ఇప్పుడు వారంతా ఏడు పదుల వయసు దాటేందుకు రెడీగా ఉన్నారు.
రాజకీయాల్లో ఇప్పటికే కురు వృద్ధులుగా పేరున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు... ఇక రాజకీయాల నుంచి తప్పుకునేందుకు రెడీ అయ్యారు. వీరి స్థానంలో వారి వారసులను బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వారసులు రాజకీయాల్లోకి తీసుకురాగా... మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు వారసునిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి వారసునిగా జేసీ అస్మిత్ రెడ్డి 2019  ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడారు. ఇక పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా ఈ ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఆయన వారసునిగా... డాక్టర్ రవి ప్రకాష్ ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు కూడా. కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ బాబు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు.
దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను కూడా బరిలో నిలిపేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అటు శ్రీకాకుళం జిల్లా మొదలు... ఇటు అనంతపురం జిల్లా వరకు ప్రస్తుతం ఏ సీనియర్ నేతను కదిపినా కూడా... ఇదే మాట... ఇక రాజకీయాలు చాలండి... మా అబ్బాయిలు చూసుకుంటున్నారు అని. సో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యువ రక్తంతో ఉరకలేయనుందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: