తిరుమల కొండపై ౩ దశల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు

N.Hari
సప్తగిరులపై పర్యావరణ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు భక్తుల రద్దీ, మరో వైపు వాహనాల రాకపోకలతో నానాటికీ వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా తిరుమల కొండపై కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు పూర్వ వైభవం తీసుకురావడానికి టీటీడీ చర్యలు ప్రారంభించింది. గత రెండు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా మొదటగా విడతల వారీగా ప్లాస్టిక్ వినియోగాని తగ్గించింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల కవర్లు మొదలుకుని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వంటి వాటికి ప్రత్యామ్నాయం తీసుకువచ్చింది. ఇలా ఇవాళ తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి స్థాయిలో బ్యాన్ కొనసాగుతోంది.
ఇక కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న తిరుమలలో తిరిగి పచ్చదనం పెంచేందుకు చెట్లు నాటడం మొదలుపెట్టింది టీటీడి. భక్తులకు నయనానందకరంగా ఉండేలా తిరుమలకు వచ్చే ఘూట్ రోడ్లతో పాటు తిరుమల కొండపై వివిధ రకాల పూల మొక్కలు, భావితరాలుకు ఉపయోగకరంగా సంప్రదాయ చెట్లను నాటడం మొదలుపెట్టడంతో పాటు ఖాళీ ప్రదేశాలను గ్రీనరీ ఉట్టిపడే విధంగా మార్పులు చేస్తోంది. ఇలా ఇప్పటికే పర్యావరణ పరిరక్షణకు పలు మార్పులను తీసుకొచ్చిన టీటీడి చివరిగా ప్రధానమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తిరుమల ఘాట్ రోడ్లతో పాటు తిరుమల కొండపై ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
మూడు దశలలో వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చివేయాలని టీటీడీ నిర్ణయించింది. మొదటి దశలో టీటీడీ అధికారిక విధుల కోసం వినియోగించేందుకు 35 విద్యుత్ కార్ల‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన క‌న్వ‌ర్జ‌న్స్ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ నుండి కొనుగోలు చేసింది. ఇప్పటికే టీటీడీలో వినియోగిస్తున్న ఇంధన కార్లకు ప్రత్యామ్నాయంగా నూతనంగా కొనుగోలు చేసిన బ్యాటరీ కార్లను టీటీడీ కొద్ది రోజుల క్రితం నుంచి వినియోగంలోకి తెచ్చింది. 35 కార్లను తిరుమలలో పనిచేస్తున్న వివిధ విభాగాధిపతులకు కేటాయించింది.
రెండో ద‌శ‌లో మ‌రో 6 నెల‌ల లోపు 32 విద్యుత్ బ‌స్సులను న‌డిపేందుకు టీటీడీ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇందులో తిరుమల కొండపై నడిపేందుకు 20 టీటీడీ ఉచిత బ‌స్సులు కాగా.. మ‌రో 12 బ‌స్సుల‌ను ఆర్టీసీ న‌డిపేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసి న‌డిపే ఈ 12 బ‌స్సులను తిరుమలలో దర్శనీయ ప్రాంతాలైన శ్రీ‌వారి పాదాలు, ఆకాశ‌ గంగ, పాప‌ వినాశ‌నం మార్గంలో న‌డిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మూడో దశలో భాగంగా టీటీడీ విజ్ఞ‌ప్తి మేర‌కు మ‌రో 6 నెల‌ల వ్య‌వ‌ధిలోపు ఏపీఎస్‌ఆర్టీసీ కూడా తిరుమ‌ల- తిరుప‌తి ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్‌ బ‌స్సులు న‌డిపేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. మరో వైపు తిరుమ‌ల‌ ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే ట్యాక్సీ వాహ‌నాల‌ను కూడా విద్యుత్ వాహ‌నాలుగా మార్చుకున్నే విధంగా అధికారులు ప్రయివేట్‌ ట్యాక్సీ ఆపరేటర్లకు విఙ్ఞప్తి చేయనున్నారు. ఇలా రానున్న రోజులలో కాలుష్య రహిత తిరుమలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: