బుచ్చయ్య నిర్ణయం ఏమిటో..?

Podili Ravindranath
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఎదురుచూస్తున్నారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే ప్రకటించారు. తన నిర్ణయాన్ని ఈ నెల 25వ తేదీన వెల్లడిస్తామన్నారు. చెప్పిన గడువు తేదీ సమీపించడంతో... గోరంట్ల ఏం చేస్తారనే విషయం ప్రస్తుతం అటు తెలుగుదేశం పార్టీలో... ఇటు ఆయన అభిమానుల్లో కూడా ఉత్కంఠను రేపుతోంది. అసలు గోరంట్ల ఎందుకు రాజీనామా చేయాలనుకున్నారు... అసలు గోరంట్ల రాజీనామా వెనుక కారణాలేమిటి... పార్టీకి నమ్మకమైన నేతగా ఉన్న గోరంట్ల ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు... ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆయన అభిమానుల మదిలో కదులుతున్నాయి.
1982లో పార్టీ ప్రారంభించిన తొలి నాళ్లలోనే వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు కూడా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగానే ఉన్నారు. పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సహా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. దాదాపు అన్ని జిల్లాల నేతలతో కూడా గోరంట్లకు మంచి రిలేషన్ షిప్ ఉంది. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నప్పటికీ... ఏ రోజు ఆయనకు ప్రభుత్వ పదవులు అందలేదు. ఆయన తర్వాత వచ్చిన వారికి కూడా అమాత్య పదవులు వచ్చినా... గోరంట్లకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు. అటు వయోభారం కూడా పెరగడంతో... రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఇప్పటికే చెప్పేశారు కూడా. అయితే ప్రస్తుతం పార్టీ అధినేత తనను కనీసం పలకరించలేదని... తాను స్వయంగా ఫోన్ చేసినా కూడా బదులు ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. పైగా తనపై సొంత పార్టీ నేతలే పుకార్లు పుట్టిస్తున్నారని గోరంట్ల ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన పార్టీ నేతలు... ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదంతా పెద్ద మ్యాటర్ కాదన్నారు. ఆయన పార్టీ మారేది లేదని... ఈ వ్యవహారం అంతా కూడా అధినేత నిశీతంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా... ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఈ వ్యవహారంపై నోరు విప్పకపోవడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ  పరిస్థితుల్లో గోరంట్ల చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా... లేక... పార్టీ నేతల బుజ్జగింపులకు మెత్తబడతారా అనేది వేచి చూడాల్సిందే మరి. లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: