సింగరేణి లెక్కలు తేల్చకపోవడంలో మతలబు!?

N.Hari
సింగరేణిలో లాభాల లెక్కలను తేల్చడంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ లాభా ప్రకటన విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం లాభాలను ఇప్పటికీ వెల్ల‌డించ‌క‌పోవ‌డం దుమారం రేపుతోంది. 2020-21 ఆర్థిక సంవ‌త్సరం ముగిసి నాలుగు నెల‌లు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు లాభాల‌పై యాజ‌మాన్యం నోరు మెద‌ప‌డం లేదు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో సింగ‌రేణి 50.58 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఉత్పత్తి ల‌క్ష్యాన్ని సాధించింది. అంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రాలతో పోలిస్తే ఇది త‌క్కువే. అయినా యాజ‌మాన్యం మాత్రం లాభాల‌పై ఇప్ప‌టికీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు. ఈ విష‌యంలో జ‌రుగుతున్న జాప్యంపై కార్మిక సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం లాభాల‌ను ప్ర‌క‌టించని సింగరేణి యాజ‌మాన్యం... ఈ ఆర్థిక సంవ‌త్స‌ర తొలి నాలుగు నెల‌ల‌ లాభాల‌ను మాత్రం  ప్ర‌క‌టించింది. 2021-22 తొలి నాలుగు నెల‌ల్లో 8,180 కోట్ల రూపాయల ట‌ర్నోవ‌ర్  చేసిన‌ట్లు  వెల్ల‌డించింది.దీంతో యాజ‌మాన్య తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఏ ప‌రిశ్ర‌మ అయినా ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసిన వెంట‌నే లాభ న‌ష్టాల లెక్క‌లు ప్ర‌క‌టిస్తుంది. కంపెనీల ట‌ర్నోవ‌ర్, ఆదాయ‌, వ్య‌యాల బ్యాలెన్స్ షీట్ బ‌హిర్గ‌తం చేస్తుంది. సింగ‌రేణి యాజ‌మాన్యం ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రం ఇలాగే జాప్యం చేయ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి,.
నిజానికి సింగ‌రేణి లాభాలపై ఉత్కంఠ పెర‌గ‌డానికి కార‌ణం... లాభాల్లో కార్మికుల‌కు ద‌క్కాల్సిన వాటానే. గ‌త 22 ఏళ్లుగా కంపెనీకి వ‌చ్చిన లాభాల్లో కొంత శాతం కార్మికుల‌కు బోన‌స్‌గా చెల్లిస్తున్నారు.  1998-99 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. తొలి సారి లాభాల్లోంచి   10శాతం వాటా చెల్లించారు. అప్పటి  నుంచి సింగ‌రేణి ప్ర‌తి యేటా భారీగా లాభాల‌ను ఆర్జిస్తూ వ‌స్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే  కార్మికుల‌కు ఇచ్చే వాటా శాత‌మూ పెరుగుతోంది. అయితే సింగరేణి లెక్కలు ప్రకటిస్తే.. లాభాల్లో వాటా కోసం కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచే అవ‌కాశం ఉంద‌ని యాజ‌మాన్యం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకోస‌మే ఆడిటింగ్ పేరిట కాల‌యాప‌న చేస్తున్నార‌ని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. వీలైనంత త్వ‌ర‌గా సింగరేణి లాభాలపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: