జ్యోతుల ఫ్యామిలీ కూడా రెడీ అయిపోయిందా?

M N Amaleswara rao
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు అధికార వైసీపీపై ధీటుగా టీడీపీ నేతలు పోరాడుతున్నారు...నిదానంగా టీడీపీ పికప్ అవుతుందనుకునే సమయంలో, ఆ పార్టీకి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ రూపంలో భారీ షాక్ ఎదురైంది. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒక్కరిగా ఉన్న బుచ్చయ్య, పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిసింది. పార్టీ అధినాయకత్వం సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని, తాను ఫోన్ చేసినా...చంద్రబాబు, లోకేష్‌లు స్పందించడం లేదని బుచ్చయ్య అలకపాన్పు ఎక్కారు. ఇదే క్రమంలోనే టీడీపీకి రాజీనామా చేయాలని బుచ్చయ్య సిద్ధమయ్యారు.
అయితే చంద్రబాబు మాట్లాడినా సరే బుచ్చయ్య వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. మరి టీడీపీలో బుచ్చయ్య ఎపిసోడ్ ఎంతవరకు వెళుతుందో ఓ వారంలో తెలిసిపోతుంది. ఇక బుచ్చయ్య ఎపిసోడ్ పక్కనబెడితే...అదే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మరో టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ సైతం, పార్టీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. టీడీపీలో జ్యోతుల ఫ్యామిలీ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జ్యోతుల నెహ్రూ..జగ్గంపేట ఇన్‌చార్జ్‌గా ఉంటే, ఆయన తనయుడు నవీన్..కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గుండెనొప్పితో బాధపడుతున్న జ్యోతుల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే జ్యోతులని వైసీపీ నేతలు పరామర్శిస్తున్నారు. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు జ్యోతులని పరామర్శించారు.
దీంతో జ్యోతుల ఫ్యామిలీ కూడా వైసీపీలోకి వెళుతుందని ప్రచారం జరుగుతుంది. పైగా జ్యోతుల కూడా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే మొన్న ఆ మధ్య ఎం‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరించడాన్ని తప్పుబట్టిన జ్యోతుల, టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచే జ్యోతుల పార్టీని వీడే అవకాశాలున్నాయని కథనాలు వచ్చాయి. కాకపోతే జ్యోతుల ఫ్యామిలీ వైసీపీలోకి వెళితే సీట్లు ఏమి ఖాళీ లేవు. మరి చూడాలి జ్యోతుల ఫ్యామిలీ కూడా చంద్రబాబుకు హ్యాండ్ ఇస్తుందేమో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: