ఆ జిల్లాకు బెర్త్‌లు తక్కువ... వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ!

M N Amaleswara rao
కర్నూలు జిల్లా...ఈ జిల్లా పేరు చెబితే చాలు...వైసీపీకి కంచుకోట అని అర్ధమైపోతుంది. రాష్ట్రంలో రాజకీయం ఎలాగైనా ఉన్నా సరే, కర్నూలులో మాత్రం రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. అందుకే 2014 ఎన్నికల్లో సైతం జిల్లాలో ఎక్కువ సీట్లు వైసీపీ గెలుచుకుంది. మొత్తం 14 సీట్లలో వైసీపీ 11 గెలుచుకుంటే, టీడీపీకి మూడే దక్కాయి. 2019 ఎన్నికలైతే చెప్పాల్సిన పని లేదు...మొత్తం వైసీపీనే క్లీన్‌స్వీప్ చేసేసింది.
అంటే జిల్లాలో ఫుల్‌గా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇలా జిల్లా అంతా వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల మంత్రివర్గం విషయంలో పోటీ ఎక్కువైంది. మొదట విడతలో జిల్లా నుంచి ఇద్దరుకు జగన్ క్యాబినెట్‌లో చోటు దక్కింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్ధిక మంత్రిగా, గుమ్మనూరు జయరాంకు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది.
అయితే రెండో విడతలో మంత్రిగా అవకాశం దక్కకపోదా అని పలువురు ఎమ్మెల్యేలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రెండో విడతలో బుగ్గన కంటిన్యూ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇక గుమ్మనూరు జయరాం బెర్త్ మాత్రం కాస్త డౌట్‌గానే ఉంది. ఎందుకంటే ఆయనపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని, భూ కబ్జాలు, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో నెక్స్ట్ జయరాం మంత్రివర్గంలో కంటిన్యూ అవ్వడం కష్టమే అని తెలుస్తోంది.
దీంతో కర్నూలుకు ఒక బెర్త్ ఇస్తారా? రెండు బెర్త్‌లు ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఎన్ని బెర్త్‌లు ఇచ్చిన జిల్లాలో మాత్రం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగానే ఉంది. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి ప్రసాద్ రెడ్డి, పాణ్యం నుంచి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానపల్లె నుంచి కాటసాని రామిరెడ్డిలు క్యాబినెట్ బెర్త్ కోసం వెయిట్ చేస్తున్నారు. అటు జిల్లాలో జూనియర్ ఎమ్మెల్యేలు సైతం లక్కీగా మంత్రిగా పదవి వస్తుందేమో అని చూస్తున్నారు.  మరి కర్నూలులో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: