చేయి తడిపితేనే నేతన్న నేస్తం లబ్ధి!?

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం లబ్ధి.. ఇవాళ నగదు రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానుంది. అసలే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకానికి అర్హులు కంటే అనర్హులే సులభంగా ఎంపికయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా లబ్ధిదారుల సంఖ్యను కూడా ప్రభుత్వం కుదించి వేసింది. చేనేత కుటుంబాల ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉంటే.. నేతన్న నేస్తం పథకానికి అర్హులైనప్పటికీ వారి పేరును డిలీట్‌ చేయడంతో.. గతంలో 82 వేలుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 80 వేలకు చేరింది. ఇక తమకు ప్రభుత్వం అందించే సాయం కోసం లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరుగుతూ అక్కడే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్యాష్‌ చేసుకుంటున్నారు. నేతన్న నేస్తం కావాలంటే.. అందులో సగం వరకు వాటా కావాలని డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నేతన్ననేస్తం కోసం చేనేత కార్మికులు ఎదురుచూస్తుండగా.. దీన్ని అడ్డుపెట్టుకుని గ్రామ సచివాలయం సిబ్బంది లంచావతారాలుగా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకంలో చిత్తూరు జిల్లాలో మాత్రం ప్రతియేటా లబ్ధిదారుల జాబితాలో కోతలు కోస్తూనే ఉన్నారు. ఇక నేతన్న నేస్తం జాబితాలోని లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కాసుల కక్కుర్తి పట్టిపీడిస్తోంది. లబ్ధిదారునికి అందే సంక్షేమంలో సగం వాటా తమకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీడీవో తప్పనిసరిగా సచివాలయం తనిఖీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నా.. మదనపల్లెలో మాత్రం అధికారులు తనిఖీకి వెళ్లిన దాఖలాలు లేవు . దీంతో సచివాలయ సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది.  ఈ క్రమంలో మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామ పర్యటనకు వచ్చిన మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషాకు చేనేత కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.  ఎమ్మెల్యే సాక్షిగా గ్రామ సచివాలయ సంక్షేమ అసిస్టెంట్ చేనేత కార్మికుడి నుంచి లంచం డిమాండ్ చేసిన విషయం బయటపడింది.
మదనపల్లె పట్టణంలో 10 వేల మంది చేనేత కార్మికులు పని చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం లబ్ధి మదనపల్లెలో కొంతమందికే దక్కుతోంది. ఇక్కడ మొదటి సంవత్సరం 4 వేల మంది లబ్ధిపొందగా... రెండో సంవత్సరం 500 మందికి కోత విధించారు. ప్రస్తుతం మూడో సంవత్సరం కోటాలో మంగళవారం నాడు  నేతన్న నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేయనుంది ప్రభుత్వం. మూడో విడతలోనూ  పలు నిబంధనలను పెట్టి అర్హులు అయిన తమకు 24వేలు లబ్ది అందకుండా చేస్తున్నారని చేనేత కార్మికులు వాపోతున్నారు. మదనపల్లె పట్టణంతో పాటు మదనపల్లె మండలంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే రూ.24 వేలు దక్కాలంటే వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: