ప‌రిటాల శ్రీరామ్‌, సునీతకు ఆ రికార్డు సొంత‌మ‌య్యేనా ?

VUYYURU SUBHASH
దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌రిటాల ర‌వి అంటే అప్ప‌ట్లో ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు హ‌డ‌ల్‌. అనంత‌పురం ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది పేద‌ల‌కు అండ‌గా ఉన్న ఆయ‌న చివ‌ర‌కు అదే ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు బ‌లైపోయారు. ఆయ‌న రాజ‌కీయ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన భార్య సునీత పెనుగొండ‌, రాఫ్తాడు నుంచి మూడుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్ట‌డంతో గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో సునీత పోటీ నుంచి త‌ప్పుకుని త‌న వార‌సుడు శ్రీరామ్‌ను రాఫ్తాడు బ‌రిలో దింపారు. అయితే ప్ర‌భుత్వ వ్య‌తిరేక గాలుల నేప‌థ్యంలో శ్రీరామ్‌కు తొలి ఎన్నిక‌ల్లోనే చేదు అనుభ‌వం ఎదురైంది.

ఎన్నిక‌ల్లో ఓడిన తొలి యేడాది పాటు సైలెంట్‌గా ఉన్న శ్రీరామ్ ఇప్పుడు ప్ర‌జాక్షేత్రంలోకి దుమికి పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా రాఫ్తాడు, ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు ప‌రిటాల ఫ్యామిలీ మీదే పెట్టేయ‌డంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సునీత‌, శ్రీరామ్ ఇద్ద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నారు. క‌రోనా స‌మ‌యంలో కూడా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కేడ‌ర్‌ను వారు వ‌ద‌ల్లేదు. రాఫ్తాడులో అధికార పార్టీ నేత‌ల అరాచ‌కాల‌కు శ్రీరామ్ ఎదురొడ్డి నిల‌బ‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయినా కూడా పార్టీ కేడ‌ర్‌కు ధైర్యం చెప్పి ముందుకు న‌డ‌పిస్తున్నారు.

ఇక ప‌రిటాల శ్రీరామ్ పోరాటంతో ధ‌ర్మ‌వ‌రం, రాఫ్తాడు రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి జ‌వ‌స‌త్వాలు వ‌స్తున్నాయి. వాస్త‌వంగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ర‌వి ఉన్న‌ప్ప‌టి నుంచే టీడీపీకి కంచుకోట‌లు. పార్టీ 2004లో ఓడిపోయిన‌ప్పుడు కూడా ధ‌ర్మ‌వ‌రంలో ర‌వి ఆధ్వ‌ర్యంలో టీడీపీ జెండా ఎగిరింది. ఇదంతా ర‌వి వేసిన పునాదే..! ఇక ఇప్పుడు తండ్రి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని ధ‌ర్మ‌వ‌రంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫేస్‌బుక్ ప్ర‌చారాన్ని తిప్పికొడుతూ ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. ధ‌ర్మ‌వ‌రంలో కేతిరెడ్డిని ఢీకొట్టేందుకు శ్రీరామ్ రెడీగా ఉన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది.
ఇక రాఫ్తాడు నుంచి ప‌రిటాల సునీత పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. రాఫ్తాడులో బీసీల్లో అప్పుడే మార్పు వ‌చ్చేసింది. ఈ సారి సునీత‌మ్మ సెంటిమెంటు అక్క‌డ ప్ల‌స్ కానుంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌డం అయితే ఖాయంగా క‌నిపిస్తోంది. వీరిద్ద‌రు గెలిస్తే ప‌రిటాల ర‌విని మించిన రికార్డు అయితే వీరు సొంతం చేసుకుంటారు. అసెంబ్లీలో ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఉన్న‌ త‌ల్లి, కొడుకులుగా సునీత‌, శ్రీరామ్ రికార్డుల‌కు ఎక్క‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: