నేడు కొకపేట, ఖానాపూర్ సర్కార్ భూముల వేలం..!

Suma Kallamadi
తెలంగాణ రాష్ట్ర పరిధి ఆధీనంలో ఉన్న భూముల వేలం ప్రక్రియకు సర్వం సిద్ధం అయ్యింది. కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపాలని భాజపా నేత విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇరువురి వాదనలు విని భూముల వేలాన్ని ఆపేందుకు నిరాకరించింది. ఫలితంగా ప్రభుత్వ భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రంగారెడ్డిలోని కోకాపేటలో నియోపొలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్లు, గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్‌లోని ప్లాటును ఆన్‌లైన్‌ వేదికగా వేలం వేసి కోట్ల రూపాయలకు విక్రయించడానికి ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్క ఎకరానికి కనీస ధర రూ.25 కోట్లుగా హెచ్ఎండిఏ నిర్ణయించినా.. అందుకు రెట్టింపు ధర వస్తుందని ఆ సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విధంగా లెక్క కడితే మొత్తం ప్రభుత్వ భూముల ద్వారా దాదాపు రూ.5,000 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఐతే కోకాపేటలో మొత్తం 44.94 ఎకరాలు వేలానికి పెట్టగా.. ఖానామెట్ లో 14.92 ఎకరాల భూములు వేలానికి పెట్టారు.


ఐతే కలకత్తాకు చెందిన ఎంఎస్టీసీ అనే సంస్థ ఈ భూముల వేలాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. కొంతకాలం క్రితం ఇదే సంస్థ ఉప్పల్ భగాయత్ భూముల వేలం ప్రక్రియను నిర్వహించింది. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి అథారిటీ ఇప్పటికే 3 సార్లు ఆన్‌లైన్‌ బిడ్డింగ్ ద్వారా భూములు వేలం వేసింది. ఫస్ట్ సారి 350-400 కోట్ల వరకు వచ్చాయి. మిగతా రెండు వేలం ప్రక్రియలలో రూ.1000 కోట్లు వచ్చాయి. ఇప్పుడు వేసే వేలం ద్వారా 3 నుంచి 5 వేల కోట్ల వరకు రావచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏ మొదటి 3 సార్లు గృహనిర్మాణాల కోసం భూములను వేలం వేసింది. కానీ ఇప్పుడు మాత్రం కంపెనీలు, బడా సంస్థలకు ప్రభుత్వ భూములు అప్పగించేందుకు వేలం ప్రక్రియకు తెరలేపింది. అయితే ఈసారి వేలాన్ని అడ్డుకోకుండా సివిల్ కోర్టులో కేవియట్ పిటిషన్ ను హెచ్ఎండిఏ దాఖలు చేసింది.


గురువారం రోజు ఉదయం 4 ప్లాట్లు, మధ్యాహ్నం 4 ప్లాట్లు వేలం ప్రక్రియ కొనసాగనుంది. మరుసటి రోజు ఆన్‌లైన్‌ బిడ్డింగ్ లో టీఎస్ఐఐసీకి చెందిన 30 ఎకరాలు 6 ప్లాట్లు వేలం వేయనున్నారు. ఐతే వివిధ రాష్ట్రాల కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు ఆన్‌లైన్‌ బిడ్డింగ్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. భూముల అమ్మకాన్ని అడ్డుకోడానికి 8 పిటిషన్లు దాఖలయ్యాయి కానీ సరైన ఆధారాలు లేవని హైకోర్టు భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు నిరాకరించింది. ఇకపోతే హెచ్ఎండిఏ అధికారులకు కూడా ఆన్‌లైన్‌ బిడ్డింగ్ వ్యవస్థ కనిపించడం లేదు. కేవలం ప్రిన్సిపల్ సెక్రెటరీకి మాత్రమే ఐడి పాస్ వర్డ్ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: