రామ్మోహన్ బావ ‘సైకిల్’ని నిలబెడతారా?

M N Amaleswara rao

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి బడా ఫ్యామిలీలు చిత్తు అయినా సరే, కింజరాపు కుటుంబం మాత్రం మంచి విజయాలనే దక్కించుకుంది. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిస్తే, అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మొదటి సారి దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె, రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయాన్ని దక్కించుకున్నారు.


రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసే భవాని దాదాపు 30 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. అయితే భవానికి కింజరాపు ఫ్యామిలీ సపోర్ట్‌తో పాటు ఆదిరెడ్డి ఫ్యామిలీ సపోర్ట్ ఉండటంతోనే భారీ మెజారిటీతో గెలవగలిగారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన భవానికి రాజకీయాలు కొత్త అందుకే, నియోజకవర్గంలో బాధ్యతలని భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ చూసుకుంటున్నారు. ఈయనే సిటీ నియోజకవర్గంలో టీడీపీ కోసం కష్టపడుతున్నారు.


ఎమ్మెల్యేగా భవాని ఉన్నా సరే అనధికార ఎమ్మెల్యేగా నడుచుకుంటూ సిటీ ప్రజల సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా నిలబడ్డారు. పేదలకు నిత్యం ఏదొకరకంగా సాయం చేస్తూనే వచ్చారు. ఇలా ఓ వైపు ప్రజలకు అండగా ఉంటూనే, మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ తరుపున శిఖాకొల్లు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల సత్యనారాయణ, రౌతు సూర్యప్రకాశ్‌లు పనిచేస్తున్నారు.  ఈ ముగ్గురుకు ధీటుగానే రామ్మోహన్ బావ పనిచేస్తున్నారు.


పైగా రాజమండ్రి కార్పొరేషన్‌లో సైకిల్‌ని నిలబెట్టడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. ఇటీవలే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్‌ల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో వాయిదా పడిన స్థానాలకు కూడా ఎన్నికలు పెట్టి సత్తా చాటాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కానీ రాజమండ్రిలో వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని ఆదిరెడ్డి ఫ్యామిలీ కష్టపడుతుంది. అటు రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ సపోర్ట్ కూడా ఉంటే రాజమండ్రిలో రామ్మోహన్ బావ సైకిల్‌ని నిలబెట్టగలరేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: